ys jagan have to control his languageపెద్దలు పెట్టిన సామెతలకు ఎప్పుడూ ఒక అర్ధం, అంతరార్ధం ఉంటాయి. అయితే వాటిని సరిగా అవపోసనం చేసుకుని అనుసరిస్తున్నామా? లేదా? అనేది మనలోని విజ్ఞత తెలియజేస్తుంది. ప్రస్తుతం అలాంటి సామెత ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరుకు అద్దం పడుతోంది.

“నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం” – ఈ రెండూ ఉంటే సమాజంలో చక్కగా జీవించవచ్చు అనేది పూర్వీకుల భావన అయి ఉండొచ్చు. ఈ సూత్రం ఒక వ్యక్తికే కాదు, రాష్ట్రానికి కూడా వర్తిస్తుందన్న విషయాన్ని రాష్ట్ర పెద్దలు పూర్తిగా విస్మరించినట్లున్నారు. అందుకే “అదుపు – పొదుపు” అన్న మాటలను దరి చేరకుండా పరిపాలన కొనసాగిస్తున్నారు.

పార్లమెంట్ లో ఏపీ పరువు తీస్తున్నారంటూ ప్రస్తుతం గొంతు చించుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి వర్యులు, నాడు ప్రతిపక్షంలో ఉండి చేసిందేమిటో గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో? అలాగే వరల్డ్ బ్యాంకుకు తమ ప్రతినిధుల ద్వారా లేఖలు పంపించినపుడు ఆలోచించి ఉంటే, ఏపీ పరువు గురించి నేడు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చేది కాదేమో?!

నాటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వర్గీయులు ఇంత చేసినప్పటికీ, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నోరు జారలేదు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం ప్రత్యర్థులను ‘దౌర్భాగ్యుడు’ అంటూ ఒక్కొక్కరిని వర్ణించడం అనేది, నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తుంది.

ప్రత్యర్థి రాజకీయ పార్టీలుగా పద్ధతిగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. కానీ అవి హద్దులు దాటకుండా, “అదుపు”లో ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ రాష్ట్ర పెద్దగా వ్యవహరించే వ్యక్తే అదుపు తప్పితే, ఇక క్రింద స్థాయి వారికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్లు? సంయమనం వ్యవహరించాల్సిన వ్యక్తులే సమరం ఉత్పన్నం అయ్యే విధంగా ప్రసంగించడం ఎంతవరకు సబబో? ఆయనే ఆలోచించుకోవాలి.

“అదుపు” లేని చోట కనీసం “పొదుపు” అయినా ఉంటుందా? అనుకుంటే, దానికి కూడా అందనంత దూరంలో జగన్ పరిపాలన కొనసాగుతోంది. ఏపీ ఆర్ధిక విభాగంలో క్రమశిక్షణ లోపించిందని ఇప్పటికే కేంద్ర సంస్థలు హెచ్చరించిన వైనం తెలియనిది కాదు. అలాగే గత బడ్జెట్ లో లెక్కలోకి రాకుండా 48 వేల కోట్లు ఖర్చు చేసారని జరుగుతోన్న తంతు.., అసలు “పొదుపు” అన్న మాటకే “ఆస్కారం” కల్పించడం లేదు.

ఆర్ధిక విషయాలు పక్కనపెడితే, కనీసం అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన “పొదుపు” విద్యుత్ నైనా “అదుపు”లో ఉంచుకుందా? అంటే అది కూడా అదుపు తప్పిందనే చెప్పాలి. కరెంట్ కోత కారణంతో చిన్న పిల్లలు మరణించారన్న విషయం జీర్ణం కావడమే కష్టం. అలాంటిది సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన చేసుకోవడం, బహుశా సీఎం పాలనకు నిదర్శనంగా పేర్కొనలేమో?!

అధికారం ఇంకా రెండేళ్ల పాటు చేతిలో ఉంది గనుక, కనీసం ఈ రెండేళ్లయినా “మాటలు అదుపులో – చేతలు పొదుపులో” ఉంటాయని ఆశిద్దాం.