YS Jagan dalitsఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల టూర్ ఆసాంతం వివాదాస్పదం అయ్యింది. అన్యమతస్తుడైన జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్ళాలి అని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చెయ్యగా… ముఖ్యమంత్రి ఎప్పటిలానే డిక్లరేషన్ ఇవ్వకుండానే కొండపైకి వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి వచ్చారు.

తాజాగా ఈ టూర్ గురించి సోషల్ మీడియాలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ దుర్గా ప్రసాద్ కరోనా బారిన పడి మరణించారు. అంతదాకా వెళ్లినా జగన్ కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని.. దళితులంటే జగన్ కు ఎందుకు చిన్నచూపు? అని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు.

ఇదే ప్రతిపక్షంలో ఉంటే ఓదార్పు పేరిట యాత్రలు చేసే వారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే… తిరుపతి నుండి జగన్ అమరావతి వెళ్లకుండా హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న తన మామగారు గంగిరెడ్డి (జగన్ సతీమణి భారతి తండ్రి)ని పరామర్శించారు.

దానిని ఎత్తిచూపుతూ ఈ విషయాన్ని మరింత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. మరోవైపు… తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ప్రతిపక్షాలు పోటీ పెడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. సహజంగా ఇటువంటి ఉపఎన్నికలలో అధికారపార్టీ వైపు మొగ్గు ఉంటుంది.