Jagan-Cabinet-Meetఉద్యోగుల పెన్షన్ చెల్లింపు విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా చాలా… దూరం ఆలోచించింది. ఎంత దూరమంటే… 2041, 2070 సంవత్సరాల వరకు!

ప్రభుత్వానికి అంత దూరదృష్టి ఉండటం చాలా అభినందనీయమే. ఉద్యోగుల ఒత్తిళ్ళకు తలొగ్గి పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) అమలుచేస్తే 2041 సంవత్సరానికి ప్రభుత్వంపై రూ.65,234 కోట్లు, 2071 సంవత్సరంనాటికి రూ. 3,73,000 కోట్లు భారం పడుతుందని లెక్కలు కట్టారు.

అప్పుడు ప్రభుత్వం అంత భారం భరించలేక ఆ పెన్షన్ విధానాన్ని రద్దు చేయవలసి వస్తుందని మంత్రివర్గ సమావేశంలో కనిపెట్టారు. కనుక ప్రభుత్వంపై అంత భారం పడకుండా, ఉద్యోగులు నష్టపోకుండా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌ (జీపీఎస్)నే అమలుచేయాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు.

గత నాలుగేళ్ళుగా సంక్షేమ పధకాల కోసం లక్షల కోట్లు ఎడాపెడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, మరో 20-50 ఏళ్ళ తర్వాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ఇప్పుడే ఆలోచిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం లక్షల కోట్లు అప్పులు చేసి పంచిపెడుతున్న వైసీపీ ప్రభుత్వం, 30-40 ఏళ్ళు ప్రభుత్వానికి సేవలు చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు సరిపడ పెన్షన్ ఇచ్చేందుకు వెనకాడుతోంది. జీపీఎస్ పేరుతో మెలికలు పెడుతోంది.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)ను రద్దు చేసి మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్) అమలుచేస్తుందని జగన్‌ ఎన్నికలలో హామీ ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్పను అని గొప్పగా చెప్పుకొనే సిఎం జగన్‌, నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసిన తర్వాత ఇప్పుడు ఓపిఎస్ సాధ్యం కాదు జీపీఎస్ ఇస్తామని చెప్పడంతో ప్రభుత్వోద్యోగులు భగ్గుమంటున్నారు.

ఒకవేళ ఉద్యోగుల పెన్షన్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలనుకొంటే మంచిదే. కానీ పార్టీలో రాజకీయ నిరుద్యోగులను సంతృప్తి పరిచేందుకు డజన్ల కొద్దీ సలహాదారులను నియమించుకొని ఉండకూడదు. పార్టీ అవసరాల కోసం లక్షల మంది వాలంటీర్లను నియమించుకొని ఉండకూడదు. మళ్ళీ వారికి ‘సాక్షి న్యూస్ పేపరు’ కొనుక్కోవడానికి నెలకు రూ.200 చొప్పున ఇవ్వడం, ఏడాదికోసారి వారికి సన్మానాలు సత్కారాలు పేరుతో వందల కోట్లు పంచిపెట్టకూడదు.

ఓట్ల కోసం సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెడుతుండటం, ప్రతీ పధకానికి వందల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇచ్చుకోవడంవంటివి మానుకొని ఉండాలి. కానీ అవేవి మానుకోకుండా ఉద్యోగుల పెన్షన్ చెల్లించేందుకు లెక్కలు కట్టుకొంటోంది. అదీ… మరో 20-50 సంవత్సరాల తర్వాత పడే ఆర్ధిక భారం గురించి! విడ్డూరంగా లేదూ?