ys jagan grama volunteer jobsజగన్ పాలనలో గత రెండేళ్లలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయంటూ అన్ని ప్రధాన పత్రికలలో యాడ్లు వేశారు. ఈ లెక్కలలో పెద్ద ఎత్తున జిమ్మిక్కులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు వీటిని ఆధారాలతో సహా నిరూపించి జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే జగన్ పాలనలో సొంత మనుషులకే ఉద్యోగాలు శాశ్వతం కాదు అంటున్నారు.

6,03,756 ఉద్యోగులలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 2,59,565 మందికి వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే వీరివి ప్రభుత్వ ఉద్యోగాలు కాదని… వారు కేవలం సేవ మాత్రమే చేస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రే ఒక బహిరంగలేఖ రాసి చెప్పారు. పైగా వీరికి 5,000 రూపాయిల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే ఇతర బెనిఫిట్లు ఏమీ లేవు. తాజా ప్రకటనలో మాత్రం వారిని ప్రభుత్వ ఉద్యోగాల జాబితాలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పేర్కొన్నారు. ఇక జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇంతే. ఈ లెక్క కింద 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పుకున్నారు.

ఇవి శాశ్వత ఉద్యోగాలని పైకి చెబుతుండగా… ఇప్పటి వరకూ సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్ట్రర్‌లో నమోదు ప్రక్రియ కూడా పూర్తికాలేదు. వారికి కేవలం ప్రొబేషనరీ పిరియడ్ పేరుతో ప్రస్తుతం నెలకు రూ. 15 వేలు వేతనం మాత్రమే ఇస్తున్నారు. పీఎఫ్ సహా ఇతర సదుపాయాలేమీ అందడం లేదు. ఇలా జగన్ తన సొంత వారికే శాశ్వత ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని విమర్శలు వస్తున్నాయి.