YS Jagan -TDPకరోనా రక్కసి వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. మందులు, ఆక్సిజన్ కొరత తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జబ్బు పడిన వారికి కనీసం బెడ్లు దొరకని పరిస్థితి. ఒక పక్క ఇటువంటి హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉన్నా ఏపీలో రాజకీయాలే ప్రధానం అయిపోయాయి అధికార పక్షానికి అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నరేంద్ర ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం… తన వేగాన్ని మరింత పెంచింది.

ఈ తెల్లవారు జామున మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు సంబంధించిన ఒక బిల్డింగ్ ను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేసింది. ఈరోజు సాక్షి చదివితే విశాఖకే చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ గా స్పష్టం అవుతుంది. ‘వెలగపూడి వైరస్‌’ అంటూ ఒక కథనం వెలువరించింది సాక్షి.

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే… నరేంద్ర ను వరుసగా మూడు రోజులు కోర్టు సెలవులు వచ్చినప్పుడే అరెస్టు చేసి బెయిల్ రాకుండా చెయ్యడం. అలాగే పల్లాకు నోటీసులు ఇవ్వకుండా… అలాగే కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా ఆదివారం భవనం కూల్చడం. అదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్టుగా అర్ధం కాక మానదు.

మొత్తానికి కరోనా సమయంలో ప్రజల దృష్టి, మీడియా దృష్టి ఎక్కువగా కరోనా మీదే ఉండటంతో ఆలోగా తమ పని చక్కబెట్టుకోవాలని చూస్తుంది ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. “అయితే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాలి లేకపోతే జైలుకు పోవాలి. లొంగని వారిని భయపెట్టే ప్రయత్నాలే ఇవి,” అంటున్నారు వారు.