YS Jagan Movie Ticketsకరోనా రెండు సార్లు చూపించిన ప్రతాపంతో కుదేలైన జాబితాలలో సినీ ఇండస్ట్రీ కూడా ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్, డిసెంబర్ 2 మొదలు వచ్చే సమ్మర్ వరకు వరుస సినిమాల రిలీజ్ లను ప్లాన్ చేసాయి, ఇప్పటికే ఆయా సినిమాల విడుదల తేదీలను కూడా ప్రకటించేసాయి.

శనివారం నాడు జరిగిన “అఖండ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో కొత్త హుషారు వచ్చింది. ఊహించని రీతిలో సినీ అభిమానులు చేసిన హంగామా తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కళను తీసుకువచ్చింది. అయితే ఇంతలోనే మరో వణుకు పుట్టించే వార్త కూడా బయటకు రావడంతో, మళ్ళీ సినీ వర్గాల్లో గుబులు మొదలైంది.

కరోనా మరో రూపం దాల్చుకుని ప్రపంచం మొత్తం చుట్టేయడానికి సిద్ధం కావడం టాలీవుడ్ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ‘ఓమిక్రాన్’ పేరుతో సిద్ధమైన కరోనా రూపం అత్యంత ప్రమాదకారి అని ధృవీకృతం కావడం, ఇప్పటికే ఆఫ్రికన్ కంట్రీస్ కు పలు దేశాలు విమానాలు రద్దు చేయడం వంటి అంశాలు కలవర పెడుతున్నాయి.

మన దేశం ఈ కరోనా వేరియంట్ ను సీరియస్ గానే తీసుకుంది. శనివారం నాడు ప్రధాని హుటాహుటిన ఈ వేరియంట్ పై చర్చలు జరపడం అనేది ‘ఓమిక్రాన్’కున్న ప్రాధాన్యతను సూచిస్తోంది. దీంతో రాబోయే ఒకటి, రెండు మాసాలు అత్యంత కీలకం కానున్నాయి. ఈ ప్రభావం మళ్ళీ సినీ ఇండస్ట్రీపై పడితే కోలుకునే అవకాశాలు లేవన్నది బాధాకరమైన అంశం.

ఒక్క ‘అఖండ’ సినిమాకే నిర్మాత మిరియాల రవీంద్ర రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడ్డారో పరోక్షంగా చెప్పకనే చెప్పారు. అలాగే నిర్మాత తనయుడిగా నాలుగు సినిమాలు రిలీజ్ చేయలేక అల్లు అరవింద్ పడుతున్న బాధేమిటో తనకు తెలుసని బన్నీ అన్నారు. ఇక వందల కోట్లతో నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ అండ్ ‘రాధే శ్యామ్’ల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

చిన్న సినిమాలకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ లేక శాటిలైట్ హక్కులతో బయట పడగలుగుతున్నారు గానీ ధియేటర్ నే నమ్ముకున్న పెద్ద సినిమాలను ఇప్పటికే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చావు దెబ్బ తీసినట్లయ్యింది. తాజాగా ఈ ‘ఓమిక్రాన్’ రూపంలో కరోనా! అయితే ఈ వేరియంట్ టాలీవుడ్ వరకు దరిచేరకూడని, సినీ పరిశ్రమ హిట్లతో కళకళలాడాలని ఆశిద్దాం.