YS Jagan govt Increases Property taxరాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో పన్నుల పెంపు.. కొత్త పన్నులు అనే మాట వినలేదు. రాజధాని, పోలవరం అంటూ విరివిగా ఖర్చు చేసిన ఏవీ పెంచకుండానే చంద్రబాబు ప్రభుత్వం బండి లాక్కొచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం రెండేళ్ల పాలన తరువాత వడ్డన మొదలుపెట్టింది. ఆస్తిపన్ను పెంపు, చెత్త పన్ను.. ఆ పన్ను ఈ పన్ను అంటూ ప్రజల మీద భారం మోపడం మొదలుపెట్టింది.

మరోపక్క ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాల విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేకపోవడంతో ఆయా పథకాలలో లబ్ధిదారులను తగ్గించి భారం దించుకునే ప్రయత్నం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే విడుదల చేసిన వాహనామిత్ర పథకం కింద దాదాపుగా పాతికవేల లబ్దిదారులను తగ్గించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఒకపక్క ప్రజలకు ఉచితాల పేరిట పంపకాలు చేస్తున్నా.. ఇటువంటి వాటి వల్ల ప్రజావ్యతిరేకత మొదలయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో నెలకి 10 వేల కోట్ల ఆదాయం వస్తుంది. అది కేవలం జీతాలకి, అప్పులు వడ్డీ లకి సరిపోతుంది. అప్పులు తెచ్చి ఉచితాలకు పంపిణీ చేస్తున్నారు. దానికోసం అమ్మకాలు, తాకట్టు అంటూ తిప్పలు పడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కన్నెర్రజేస్తే అది కూడా ఆగిపోతుంది. పైగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రజలిచ్చిన ఐదేళ్ల అవకాశంలో రెండేళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. ఈ కష్టాల మధ్య ఇంకో మూడేళ్లు అంటే చాలా కష్టం. ముందుముందు ఇబ్బందులు ప్రజల మీద భారం మోపడం కూడా ఎక్కువ అవుతుంది. జగన్ జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చేసినట్టే!