ys jagan government to run liquor shops andhra-pradesh-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పక్క సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్నాం అని చెబుతూనే మద్యం విక్రయం మీద వచ్చే ఆదాయం మీద మమకారం చంపుకోలేకపోతుంది. ఇందుకు ఈ వార్తే నిదర్శనం. రాష్ట్రంలో సెప్టెంబర్‌ చివరి వరకు కొనసాగించుకునేలా అవకాశమిచ్చినా దాదాపుగా 750 షాపులు తమ లైసెన్సు రెన్యువల్‌ చేసుకోలేదట. సహజంగా ప్రభుత్వం మద్యనిషేధం అంటుంది కాబట్టి తగ్గిన షాపులు తగ్గాయిలే అనుకోవాలి. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.

లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని 750 మద్యం షాపుల్ని వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే షాపులను నడపాలని ఆదేశించారు. అయితే అదేంటి అని అడిగితే మాత్రం షాపుల్ని వెంటనే ప్రారంభిస్తే.. ప్రభుత్వమే మద్యం షాపుల్ని ఎలా నిర్వహించాలో, ఇబ్బందులు, వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని సమర్ధించుకుంటున్నారు.

కేవలం రెండు నెలల ఆదాయం వదులుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే సంపూర్ణ మద్యనిషేధంపై వారికి ఉన్న నిబద్దత ఎలా నమ్మగలం అని పలువురు ఆక్షేపిస్తున్నారు. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని, 2024 ఎన్నికల నాటికి కేవలం ఐదు నక్షత్రాల హోటల్స్ లో మాత్రమే మద్యం లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలోని నవరత్నాలలో పొందుపరిచింది. పెట్రో ఉత్పత్తుల మీద టాక్స్లు తరువాత మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి కీలకమైంది.