Vakeel Saab TDPపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తరువాత చేస్తున్న మొదటి చిత్రం వకీల్ సాబ్. అయితే ఈ చిత్రం మీద పగబట్టింది ఏపీ ప్రభుత్వం. కరోనా కాలంలో ప్రతీ మీడియం సినిమాకు కూడా రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు మాత్రం ససేమిరా అంది. దీనిపై ఆ సినిమా వారు కోర్టుకు వెళ్లి అనుకూలమైన తీర్పు తెచ్చుకుంటే మళ్లీ కోర్టుకు వెళ్తుంది ప్రభుత్వం.

అదేమంటే పేదలను దోపీడీ చేస్తున్నారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మంత్రులు. అయితే కొందరు మాత్రం అధికార పక్షం ఒక వ్యూహం ప్రకారమే జనసేన ను టార్గెట్ చేస్తుందట. తిరుపతి ఉపఎన్నికలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి, అదే సమయంలో ఆ ఓటు బీజేపీ అభ్యర్థి వైపు పడాలి. ఆ ప్రకారం కమలం పార్టీ తిరుపతిలో రెండవ స్థానంలో ఉండాలని అధికారపక్షం కోరుకుంటుంది అని ఒక విశ్లేషణ.

వకీల్ సాబ్ సినిమా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు జనసైనికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే జనసేన లోని కొందరు తమకు తిరుపతిలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని, పవన్ కళ్యాణ్ కు బీజేపీ నాయకత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసే ఉద్దేశంలో లేరు. అయితే వకీల్ సాబ్ ఉదంతంతో అదంతా వదిలేసి ఇప్పుడు బీజేపీ వెనుక నిలిచే అవకాశం ఉంది.

లోకేష్, చంద్రబాబుల తిరుపతి ప్రచారంతో పార్టీకి కొంత ఊపు వచ్చింది. దానితో ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి రావాల్సిన పరిస్థితి. దానితో అలెర్ట్ అయ్యి అధికారపక్షం ఈ ప్లాన్ చేసి ఉండవచ్చని అంటున్నారు. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గ ప్రసాద్ రావు మరణించడంతో తిరుపతి ఉపఎన్నిక అనివార్యమైంది. సహజంగా ఎవరైనా సిట్టింగ్ ఎంపీ మరణిస్తే ఆయన కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వడం పరిపాటి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని మార్చింది. జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఫీజియోథెరపిస్ట్ గా పనిచేసిన గురుమూర్తిని కేవలం విధేయత కారణంగా అభ్యర్థిని చేసారు.