YS Jagan Govt మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ వేదికగా వెనక్కి తీసుకోవడంతో ఇంకా రాజధానుల వివాదం తొలగిపోయిందని భావించారు. అయితే మళ్ళీ ఈ మూడు రాజధానుల బిల్లును వచ్చే మార్చిలో తీసుకువస్తామని వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలతో మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇందులో భాగంగా జరిగిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తనకు తెలిసి ఇంకా బిల్లు పెట్టేది ఏమి ఉండదని, ఇదంతా కేవలం కాలయాపనలో భాగంగా చేసే ప్రక్రియగా అభిప్రాయపడ్డారు. మార్చి అంటే ఇంకా నాలుగు నెలల సమయం ఉందని, ఈ నాలుగు నెలల్లో మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉంటారా లేదా అన్నది ఒక ప్రశ్న అని, అలాగే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారా లేదా అన్నది తన రెండవ ప్రశ్నగా పేర్కొన్నారు.

ఇక మూడవది అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే… అసలు జగన్ సర్కార్ అప్పటివరకు పాలనలో ఉంటుందా లేదా అన్నది చూడాలని అన్నారు. ఇది పనికట్టుకుని ఎవరో జగన్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని, ఆర్ధిక పరిస్థితులు – పరిపాలన చేతగానితనం స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి, ఏ నిముషంలో ఏదైనా జరగొచ్చని అన్నారు.

సంక్రాంతి పండగకు వచ్చే పిట్టలదొర మాదిరి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని అన్న తులసిరెడ్డి, ఏ విధంగా మూడు రాజధానుల బిల్లు పెట్టినా అది కోర్టులలో పోతుందని, వీళ్ళు మూడు రాజధానులు కాదు, మూడు టాయిలెట్స్ కూడా కట్టలేరని విమర్శించారు. రౌడీయిజంతో చేసిన నగర, పంచాయితీ ఎన్నికలలో చాలా చోట్ల ఓడిపోయారని, నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే మొత్తం ఓడిపోయి ఉండేవారని ఇటీవల ముగిసిన ఎన్నికలపై తన భావాలను వెల్లడించారు.

వికేంద్రీకరణకు బిల్లు పెట్టకుండానే అభివృద్ధి చేయవచ్చని, దానికి బిల్లు పెట్టడం దేనికని, ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజ్ లను కేంద్రం ఇవ్వాల్సి ఉందని, దానిని తెచ్చుకుని అభివృద్ధి చేయవచ్చని, అలాగే అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం చేతిలో 9000 ఎకరాలు ఉన్నాయని, అంటే 90 వేల కోట్లు ప్రభుత్వం చేతిలో ఉన్నట్లేనని, దీనికి బిల్లు ఎందుకని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఒక్క మూర్ఖులు తప్ప ఇంత బంగారమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోరని అన్న తులసిరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశేషమైన రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నేతగా తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఏపీలో స్థానం లేకపోయినా, తులసిరెడ్డి లాంటి అనుభవజ్ఞులు మాత్రం ప్రస్తుత రాష్ట్ర స్థితిగతుల పట్ల తమ భావాలను స్పష్టంగా వెల్లడిస్తున్నారు.