YS Jagan grudge on Galla Jayadhevతెలుగుదేశం పార్టీ నేతలను ఏదో విధంగా ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతుంది అనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ… తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌పై జగన్‌ సర్కారు దృష్టి సారించింది. ఆ సంస్థకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన భూముల్లో సగం మేర వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది.

ఇప్పటికే ప్రతిపాదనలు మంత్రివర్గానికి చేరాయి. మంత్రివర్గ ఆమోదం లాంఛనమే. గ్రోత్‌కారిడార్‌లో భాగంగా కంపెనీ అభివృద్ధి, విస్తరణ ప్రణాళికలను రూపొందించుకుంటున్న దశలో 244.38ఎకరాలు వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ హయాంలో 483.27 ఎకరాల గ్రోత్‌కారిడార్‌ ప్రాజెక్టులో 244.38 ఎకరాలను కంపెనీ ఖాళీగా ఉంచిందనే కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.

అమరావతి పరిరక్షణ ఉద్యమంలో గల్లా జయదేవ్‌ క్రియాశీలకంగా ఉంటూ పోరాటం చేస్తుండడంతో ఆయన మీద పరోక్షంగా ఒత్తిడి పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుందా అని పలువురు అనుమాన పడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివాద తప్పులు కూడా జయదేవ్ పార్లమెంట్ లో ప్రస్తావించడం పాలకపక్షానికి ఇబ్బందిగా మారింది.

అయితే రాజకీయ కారణాలతో ఇటువంటి చర్యలకు పాల్పడటం అంటే పెట్టుబడిదారులలో రాష్ట్రం ఇమేజ్ పలచబడడం ఖాయం. అమరరాజా గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో 1800 కోట్లు పెట్టుబడి పెట్టింది, 6000 మందికి ఉపాధి కలిగించింది. ఇక ముందు మరో 1100 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలు ఉన్నాయని జయదేవ్ ప్రకటించిన కొన్ని రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.