y-s-jagan-mohan-reddyరెండు రోజుల క్రితమే సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడిలో పడిందని చెప్పారు. అంటే అంతకు ముందు గాడి తప్పిందనే కదా అర్దం?కానీ అంతకు ముందు శాసనసభ సమావేశాలలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బేషుగ్గా ఉందని, వృద్ధి రేటు అద్భుతంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికే ఆదర్శమని ‘సెల్ఫ్ సర్టిఫికేట్’ ఇచ్చుకొన్నారు కూడా. ఆ తర్వాత ఈ మాట అన్నారు. అంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం పొంతనలేని మాటలు మాట్లాడుతూ కాకి లెక్కలు చెపుతున్నట్లు అర్దమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన రూ.379.34 కోట్లను పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాలలోకి మళ్లించాలని ఆదేశిస్తూ సెప్టెంబర్‌ 28వ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంటే పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాడుకొంటోంది?

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదేవిదంగా పంచాయతీలకు కేటాయించిన నిధులను మళ్ళించుకొని వాడుకొంటున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీల పేరుతోనే బ్యాంక్ ఖాతాలు తెరిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికశాఖ అధ్వర్యంలో సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ పేరుతో గ్రామపంచాయతీల నిధులన్నీ పిడీ ఖాతాలలో జమా అయ్యేలా ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి వస్తున్న నిధులను వాటిలోకి మళ్లిస్తోంది. ఆ సొమ్మును విద్యుత్‌ బకాయిలు పేరుతో లేదా మరో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటోంది.

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఈవిదంగా తీసి వాడేసుకొంటుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు కూడా. పంచాయతీలకు నిధులు లేకుండా చేస్తే గ్రామాలలో ఏవిదంగా మౌలిక వసతులు సమకూర్చుకోగలము? అభివృద్ధి పనులకు నిధులు ఎవరిస్తారు?ప్రజలకు ఎవరు సమాధానం చెప్పుకోవాలని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

కేంద్రం పంచాయతీలకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈవిదంగా మళ్లించుకోవడంపై రాష్ట్ర బిజెపి నేతలు కూడా ఆక్షేపిస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎవరి విమర్శలు, అభ్యంతరాలు పట్టించుకొనే పరిస్థితిలో లేదు. నెలతిరిగేసరికి ప్రభుత్వోద్యోగులకు జీతాలు చెల్లించడానికి, సంక్షేమ పధకాలకు భారీగా నిధులు సిద్దం చేసుకోకతప్పదు. కనుక ఓ పక్క ఎడాపెడా అప్పులు చేస్తూనే మరోపక్క ఈవిదంగా పంచాయతీ నిధులను మళ్లించి వాడుకోకతప్పడం లేదు.

వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మితిమీరిన సంక్షేమ పధకాలు అమలుచేస్తుండటం, ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు, మీడియా ఇదే మాట చెపితే వాటిపై ‘ఎల్లో మీడియా’ ముద్రవేసి అవి తమ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయంటూ ఎదురుదాడి చేస్తూ తమ అసమర్దతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదేవిదంగా కొనసాగితే మున్ముందు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు కూడా!