YS Jagan Comments on Amaravati agitationఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి మద్యం ధరలు తగ్గనున్నాయి. క్వార్టర్‌ సీసాపై కనీసం రూ.వంద నుంచి రూ.250 వరకు తగ్గింది. ఫుల్‌పై రూ.400 నుంచి రూ.వెయ్యి వరకు తగ్గింది. ‘షాక్‌ కొట్టేలా మద్యం ధరలు… మద్యపానాన్ని నిరుత్సాహపరచడమే ధ్యేయం’… అని ఘనమైన ప్రకటనలు చేసిన సర్కారు లాక్‌డౌన్‌లో మూతపడిన షాపులను తిరిగి ప్రారంభించినప్పుడు పెంచిన ధరలకు అటుఇటుగా తెచ్చేసింది.

లాక్ డౌన్ తరువాత మద్యం ధరలు తగ్గడం ఇది రెండో సారి. మద్యం వాడకం తగ్గించడానికి రేట్లు పెంచాం అని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువ తాగమని అంటుందా అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే బాగా ఎక్కువగా ఉండటంతో ఆదాయం బాగా తగ్గిపోతుంది.

డబ్బులకు కటకటలాడుతున్న ప్రభుత్వం రేట్లు తగ్గించి వాడకం పెంచడం ద్వారా ఖజానా నింపుకోవాలని చూస్తుంది. అయితే అక్రమ రవాణా వల్లే ధరలు తగ్గించాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ధరలు పెంచి మద్యం మానిపిస్తామని ఫుల్ పేజీ యాడ్స్ వేసుకుని మరి చెప్పుకున్న ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది.

ఒకవేళ నిజంగా అక్రమ రవాణా వల్లే రేట్లు పెంచినా … అటువంటి పరిస్థితిని ముందుగా అంచనా వెయ్యకుండా రేట్లు పెంచడం కూడా ప్రభుత్వ వైఫల్యమే. ఇకపోతే… రెండు సార్లు రేట్లు తగ్గించినా తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధర ఇప్పటికీ 30శాతం అధికంగానే ఉంది.