YS Jagan Government on Kia Motors- (1)దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విన్నపంతోనే ఏపీలో కియా ప్లాంట్‌ ఏర్పాటు అయ్యిందని, ఈ విషయాన్ని కియా సీఈఓ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖలో స్పష్టం చేశారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ ప్లాంటు ఆంధ్రప్రదేశ్ కు తేవడంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదని, అదంతా వైఎస్ ఘనత అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కియా విషయంలో ప్రభుత్వం నవ్వులపాలు అయ్యిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటికే ఉన్న కంపెనీలు కొత్తగా వచ్చిన వారిని ప్రసన్నం చేసుకోవడం మాములే. అందుకు వైఎస్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడమూ సహజమే. సదరు సీఈఓ హ్యుందాయ్ లో ఉండగా వైఎస్ ప్లాంట్ పెట్టమని 2007 లేఖ రాశారట. సరే అలాంటి ప్రతిపాదన ఉంటే పరిశీలిస్తాం అని చెప్పారట. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. ఆయన కియాలోకి వెళ్లి ఆ తరువాత దాదాపుగా 10 సంవత్సరాలకు వైఎస్ కు ఇచ్చిన హామీ బట్టి అనంతపురంలో ప్లాంట్ పెట్టారంటే హాస్యాస్పదమే.

ఏదో జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి నాలుగు మాటలు చెబితే ఏకంగా దానివల్లే కంపెనీ వచ్చిందని అసెంబ్లీలో ప్రకటించడం విచిత్రం అని విశ్లేషకులు అంటున్నారు. సదరు సీఈఓ ఏకంగా తన ఉత్తరంలో జగన్ తన రెడ్డి పేరుకు కీర్తి తెచ్చేలా పనిచేస్తారని ఆశిస్తున్నా అని చెప్పడమే ఇందుకు ఉదాహరణ. పోనీ అంత చేసి వైఎస్ తెచ్చిన ప్రాజెక్టును ప్రతిపక్షంలో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించినట్టో అనే ప్రశ్నకూడా ఇబ్బంది పెట్టేదే. బుగ్గన అసెంబ్లీలో చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు.