Jagan-Government-Mask-Bills-Pendingకరోనా కష్ట కాలంలో ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవించారో అందరికీ తెలుసు. ఆ సమయంలో ప్రజలను కరోనా బారి నుంచి కాపాడేందుకు వైద్యులు, నర్సులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, మునిసిపల్, పోలీస్ సిబ్బంది ఇంకా అనేకమంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారు కనుకనే ప్రాణ నష్టం చాలావరకు తగ్గింది. అసలు దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పుడు దానిని ఏవిదంగా ఎదుర్కోవాలో కూడా తేలీని పరిస్థితులలో యావత్ దేశం పోరాటానికి సిద్దమైంది.

అంతకు ముందు ఎన్నడూ దేశంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేకపోవడం చేత ఆ సమయంలో మాస్కులకు తీవ్ర కొరత ఉండేది. ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలలో ఈ సమస్యని ఓ వ్యాపారావకాశంగా మలుచుకొని మాస్కుల తయారీ చేసినవారు ఎందరో లెక్కేలేదు. అదేవిదంగా ఏపీలో కూడా పలు జిల్లాలలో మహిళలు మాస్కుల తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తూ ఎంతగానో సాయపడ్డారు. అయితే కరోనా ఉపద్రవం తొలగిపోగానే వారిని ప్రభుత్వం కూడా పట్టించుకోవడం మానేసింది.

ఆ సమయంలో కొన్ని లక్షల మాస్కులు కుట్టి ప్రభుత్వానికి అందించామని నెల్లూరులోని ఓ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్త చెప్పారు. కానీ మూడేళ్ళుగా వాటికి చెల్లించాల్సిన సొమ్ముని ప్రభుత్వం చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అప్పు తెచ్చి 20 కుట్టు మిషన్లు కొని 20-30 మందిని పెట్టుకొని లక్షల సంఖ్యలో మాస్కులు తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తే, ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం‌ తమ బకాయిలు చెల్లించకపోవడంతో రోజూ అప్పులవాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద పనిచేసిన మహిళా కార్మికులకి జీతాలు చెల్లించలేకపోవడంతో వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని, జీతాల బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నానాటికీ పెరిగిపోతున్న ఈ బాధలు భరించలేకనే చివరికి సోషల్ మీడియా ద్వారా సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తన సమస్యను తీసుకువచ్చానని కనుక ఆయన చొరవ తీసుకొని ఇకనైనా తనకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఆ మహిళా పారిశ్రామికవేత్త విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో టిడిపి, జనసేనలు చిన్న మెసేజ్ పోస్ట్ చేస్తే వెంటనే ఘాటుగా బదులిచ్చే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ మహిళా పారిశ్రామికవేత్త గోడు వినిపిస్తుందో లేదో?