YS Jagan -liqour pricesఆర్ధికంగా గడ్డు పరిస్థితులలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అందే సంక్షేమ పధకాలు ఆగడానికి వీల్లేదని నిర్ణయించుకున్న జగన్ సర్కార్, అందుకు అనుగుణంగా రాష్ట్ర ఖజానాను నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు ఏదొక సరికొత్త నిర్ణయాలను వెల్లడిస్తూ వస్తున్నారు.

మద్యపానం రేట్లు తగ్గించి, మంచి బ్రాండ్ లను ఏపీకి తీసుకురాబోతున్నట్లుగా వైసీపీ సర్కార్ నిర్ణయంతో వీకెండ్ ముగిసింది. తాజాగా వారం మొదలులో ఏపీఎస్ఆర్టీసీ భవిష్యనిధిపై జగన్ సర్కార్ చేసిన సంప్రదింపులపై ప్రముఖ దినపత్రిక ఈనాడు ఓ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.

ఏపీఎస్ఆర్టీసీ పీఎఫ్ లో ఉన్న దాదాపు 1600 కోట్ల నిధులను ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ లో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం కోరుతున్నట్లు ఈ ప్రచురణ సారాంశం. అయితే ఇందుకు నిబంధనలు అంగీకరించవని చెప్తూ, ఆర్టీసీ యాజమాన్యం ఈ ప్రతిపాదనకు సుముఖుంగా లేదని తెలుస్తోంది.

ఒక్క ఆర్టీసీ విభాగంలోనే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిధులను మరియు ఇతర బ్యాంకులలో ఉన్న డిపాజిట్ మొత్తాలను కూడా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో డిపాజిట్ చేయాలంటూ సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ క్రమంలోనే ఆర్టీసీ పీఎఫ్ తలుపు తట్టినట్లుగా తెలుస్తోంది.

ఇలా పీఎఫ్ ఖాతాలలోని డబ్బులను కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇచ్చిన సంక్షేమ పధకాల హామీలు నెరవేర్చడానికి వినియోగించేస్తే, భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్న “భవిష్య నిధి” పేరుకు అర్ధం ఏముంటుంది? చేస్తోన్న ఉద్యోగానికి విలువ ఏముంటుంది? అన్న ప్రశ్నలతో సతమతమవడం ఉద్యోగుల వంతవుతోంది.