YS Jagan - Solar Powerకాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద తీవ్ర విమర్శలు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక లేఖ రాసి ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టించి మరీ దానిని బహిరంగ పరచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు దానిమీద ప్రధాన న్యాయమూర్తి చర్యలు చేప్పట్టకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అసహనంగా ఉంది.

మరోవైపు… మరో కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హై కోర్ట్ న్యాయమూర్తుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విశాఖపట్నంలో అతిథి గృహం నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను ఏపీ హైకోర్టు పూర్తిగా లాగేసుకుందని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

అంతవరకూ పర్వాలేదు… ఆ పిటీషన్ లో హైకోర్టు జడ్జిల పై కొన్ని తీవ్ర పదజాలం వాడింది. న్యాయమూర్తులు తమ పరిధులను తెలుసుకోవాలని.. చక్రవర్తుల్లా భావించరాదని, ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేయరాదని అంటూ వ్యాఖ్యలు చేసింది. దీనిని న్యాయవ్యవస్థ మీద దాడి గా సుప్రీం కోర్టు పరిగణిస్తే ప్రభుత్వానికి ఈ సారి గట్టిగా మొట్టికాయలు వెయ్యవచ్చు.

విశాఖపట్నంలో అతిథి గృహం నిర్మించే హక్కు ప్రభుత్వానికి ఉంది… అది రాజధాని తరలింపు పరిధిలోకి రాదు అంటూ ప్రభుత్వం వాదించవచ్చు. అయితే ఇందులో న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా ఉండాల్సింది. న్యాయమూర్తులు తమ పరిధులను తెలుసుకోవాలని.. చక్రవర్తుల్లా భావించరాదని అనే వ్యాఖ్యలు చెయ్యడం సమంజసం కాదు.