YS Jagan Government ranked 12th in investmentఆంధ్రప్రదేశ్ తిరోగమనం వైపు పయనిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) రాబట్టడంలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడింది. కనీసం టాప్‌-10 రాష్ట్రాల సరసన చేరలేకపోయింది. గత ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ రూ.1,798.81 కోట్ల (0.45%)ఎఫ్‌డీఐలనే రాబట్టడం ద్వారా దేశంలో 12వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ కంటే చాలా మెరుగ్గా తెలంగాణ రూ.9,910 కోట్ల ఎఫ్‌డీఐలను రాబట్టింది. అయినా దేశంలో 8వ స్థానంలోనే నిలిచింది. కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని డిపార్టుమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ విభాగం (డీపీఐఐటీ) ప్రకారం ఈ 12 నెలల కాలంలో అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.3,96,171.48 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.

ఈ విషయంలో గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు టాప్‌-5లో నిలిచాయి. ఈ అయిదు రాష్ట్రాలకు కలిపి రూ.3,43,498.70 కోట్లు(86.70%) రాగా, ఒక్క గుజరాత్‌కే రూ.1,38,530.40 కోట్లు రావడం విశేషం. దీంతో దేశం మొత్తంలో ఆ రాష్ట్ర వాటా 34.97 శాతానికి చేరింది. గతంలో చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మొదటి మూడు నాలుగు స్థానాలలో ఉండేది.

అయితే ప్రభుత్వం మారిన తరువాత ప్రాధమ్యాలు మారిపోయాయి. కేవలం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికే జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టిపెట్టడంతో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం మానేశారు. దీనితో ఉపాధి కల్పనలో కూడా రాష్ట్రం బాగా వెనుకబడుతుంది.