YS Jaganఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జోలె పట్టుకుని తిరిగే పరిస్థితికి తీసుకొస్తున్నారు పాలకులు. ఇప్పటివరకు అప్పు పుడితేనే గానీ జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. అయినా అప్పులు జెసి మరీ పప్పుబెల్లాలకు నిధులు మళ్లిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 9 – నవంబర్ 5 మధ్య 25,898 కోట్ల అప్పు చేసిన రాష్ట్రం ఈ ఏడాది అదే సమయంలో 39,250 కోట్లు అప్పుజేసింది.

అంటే అప్పులలో 52% పెరుగుదల నమోదు చేసింది. ఏడాది కాలానికి నిర్దేశించిన అప్పులను తొలి ఆరు నెలలలోనే తీసేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి లక్ష కోట్ల అప్పు చెయ్యబోతుంది. రాష్ట్ర విభజన తరువాత లక్ష కోట్ల అప్పు ఒక ఏడాది కాలంలో చెయ్యడం ఇదే మొదటి సారి.

అది సరిపోనట్టు ప్రభుత్వం స్థలాల అమ్మకానికి సిద్ధం అవుతుంది. ఇందు కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం, గుంటూరు నగరాల పరిధిలోని ప్రభుత్వ భూముల వేలానికి సిద్ధం అయ్యింది. బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌లో భాగంగా విశాఖలో మూడు చోట్ల 3.32 ఎకరాలు, గుంటూరులో రెండు చోట్ల 11.51 ఎకరాల భూములను విక్రయించేందుకు సిద్ధమైంది.

విశాఖలో పరిశ్రమల స్థాపన, గుంటూరులో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి ఉద్దేశించిన భూములను వేలంలో అమ్మబోవడం గమనార్హం. వీటి రిజర్వు ధరను రూ.106.90 కోట్లుగా ప్రకటనలో పేర్కొంది. బహిరంగ మార్కెట్లో అంతకంటే ఎక్కువే పలుకుతున్నాయి. అలా సమకూరిన నిధులు పథకాలకు మళ్లించడం ఖాయంగా కనిపిస్తుంది.