Andhra-Pradesh-employeesఏపీ ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం మంత్రుల సబ్ కమిటీతో సుదీర్గంగా చర్చలు జరిపిన తర్వాత ఈ నెలాఖరులోగా రూ.3,000 కోట్ల బకాయిలు, మరో ఆరు నెలల్లోగా మిగిలిన బకాయిలు చెల్లిస్తామని హామీ పొందారు. అయితే మంత్రుల కమిటీ హామీలను నమ్మే ఇంతకాలం మోసపోయామని, కనుక ఆ హామీలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కోరారు. అందుకు ఆయన అంగీకరించారని వారు చెప్పారు.

ఒకవేళ ఆయన ‘మినిట్స్ ఆఫ్ ది మీటింగ్’ పత్రంపై సంతకం చేసి ఈరోజు సాయంత్రంలోగా ఇస్తే దానిపై చర్చించి రేపటి నుంచి ఉద్యమం మొదలుపెట్టాలా వాయిదా వేసుకోవాలనేది నిర్ణయించుకొంటామని, లేకుంటే రేపు ఉదయం నుంచి యధాప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తారని, సీఎస్ జవహర్ రెడ్డికి చెప్పి వచ్చామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజయవాడలో విలేఖరులకు తెలియజేశారు.

ఒకవేళ మినిట్స్ పత్రం ఇచ్చిన తర్వాత ఈనెలాఖరులోగా ప్రభుత్వం రూ.3,000 బకాయిలను చెల్లించకపోయినా, మిగిలిన హామీలను అమలుచేయకపోయినా కూడా ఆందోళనలు మొదలుపెడతామని బొప్పరాజు చెప్పారు. కనుక ఈ విషయంలో ఉద్యోగ సంఘాలన్నీ ఒకే మాటపై నిలబడి, అవసరమైతే పోరాటాలకు సిద్దంగా ఉండాలని బొప్పరాజు పిలుపునిచ్చారు.

ప్రతీనెల ఉద్యోగుల జీతాలకు దాదాపు రూ.5-6000 కోట్లు, పెన్షన్లకు మరో రూ.2-3000 కోట్లు సిద్దంగా ఉంచుకోవలసి ఉంటుంది. మార్చి నెలాఖరులోగా రూ.3,000 కోట్లు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చింది కనుక ఏప్రిల్ 1వ తేదీకి ప్రభుత్వం దాదాపు రూ.10-12,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్న మాట!

ఇవి కాక అప్పులు, వాటికి వడ్డీల చెల్లింపులు ఉండనే ఉన్నాయి. అలాగే నెలనెలా సంక్షేమ పధకాల కోసం మరో రూ.3-500 కోట్లు అవసరముంటుంది. అయితే నెల నెలా జీతాల చెల్లిపులే చేయలేకపోతున్న ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగులకు ఇన్నివేలకోట్లు చెల్లించగలదా?అని ఉద్యోగ సంఘాల నేతలు అనుమానించడం సహజమే. అందుకే లిఖితపూర్వకంగా హామీ ఇమ్మనమని అడుగుతున్నారనుకోవచ్చు.

కానీ ఇస్తే ఓ బాధ ఇవ్వకపోతే మరో బాధ. హామీ ఇస్తే అది చూపించి నిలదీస్తుంటారు. ఇవ్వకపోతే వెంటనే ఆందోనలు ప్రారంభించేస్తారు. అంటే వైసీపీ ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నమాట! నూతిలో కంటే గోతిలో పడటమే బెటర్! కనుక ముందు ఆ లిఖితహామీ ఏదో ఇచ్చేసి, ఆ తర్వాత బకాయిలు చెల్లించలేనప్పుడు ఏదో కొత్త స్టోరీ చెప్పినా ఆశ్చర్యం లేదు.