YS Jagan - Andhra  Pradesh Budget 2020ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతానికి లేనట్టే. ఈరోజు సమావేశాలు మొదలు కావాల్సి ఉండగా… కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా రద్దు చేసారు. అయితే ఈ నెల 31లోగా బడ్జెట్ ఆమోదించకపోతే రూపాయి కూడా ఖర్చు చేసే అవకాశం రాష్ట్రప్రభుత్వానికి ఉండదు.

దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్ ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించుకున్నారు. దానికి సంబంధించిన ఆర్డినెన్సు కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు గవర్నర్ ఆమోదిస్తే ప్రస్తుతానికి ఈ గండం గడిచినట్టే. అయితే కొందరు నిపుణులు ఇటువంటి ప్రొవిజన్ రాజ్యాంగంలో లేదని అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఇందుకు సహకరిస్తున్నాయి. గతంలో 2004లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇలాగే బడ్జెట్ ని ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించుకుంది. అయితే అప్పటికే చంద్రబాబు మీద అలిపిరిలో ఎటాక్ జరగడంతో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు.

సభ లేని సమయంలో ఆర్డినెన్సు సంగతి వేరు గానీ సభ ఉండగా ఆర్డినెన్సు జారీ చెయ్యడం రాజ్యాంగవిరుద్దం అని పలువురు అంటున్నారు.ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ 12 కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ నిరంతర పర్యవేక్షణకు కమిటీని నియమించారు సీఎం జగన్ . ఐదుగురు మంత్రుల కమిటిలో ఆళ్ల నాని, బుగ్గన, బొత్స, మేకతోటి సుచరిత, కన్నబాబు ఉన్నారు. ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి..అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశం.