YS_Jagan_Amma_Vodi_గత ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేపదే ఓ మాట చెప్పేవారు. ప్రజల గుండెల్లో ఎప్పటికీ కొలువై ఉండాలనుకొంటున్నానని, తన తండ్రి వైఎస్సార్‌ను మరిపించేలా తన పాలన ఉంటుందని చెప్పేవారు. అది సూచిస్తూ వైఎస్సార్‌కు ప్రతిరూపం అన్నట్లు బ్యానర్లలో ఇద్దరి ఫోటోలు వేసుకొనేవారు. అది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడమే అని విమర్శలు వినిపించేవి. అది వేరే సంగతి.

ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అడగకుండానే వారిపై నవరత్నాల రాసులు కుమ్మరించి, సంక్షేమ పధకాలలో ముంచేస్తున్నారు. అయితే అందుకు లభిదారులతో పాటు మిగిలిన ప్రజలు కూడా చాలా భారీ మూల్యం చెల్లించవలసివస్తోంది.

సంక్షేమ పధకాల కోసం ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయవలసివస్తోంది. అయినా సరిపోవడం లేదు. ఈ పరిస్థితులలో వాటికి అర్హతలు, నిబందనల పేరిట లబ్దిదారులను తగ్గించుకొని కొంత భారం తగ్గించుకొంటోంది. గత ఏడాది నవంబర్‌ 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు కనీసం 75 శాతం హాజరు ఉన్న విద్యార్దులకు మాత్రమే అమ్మఒడి అంటూ కొంతమందిని తప్పించింది.

అయినా అమ్మఒడి ప్రభుత్వం మెడకు గుదిబండలాగ వ్రేలాడుతుండటంతో, ఆ పధకానికి మరో రెండు కత్తెర్లు వేసింది. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చులకు ఓ వెయ్యి, మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో వెయ్యి కలిపి మొత్తం రూ.2,000 కోత విధించింది.

ప్రభుత్వం అమ్మఒడికి ఏప్రిల్ వరకు గడువు పెట్టుకొంది కనుక బహుశః వచ్చే నెలలోగా డబ్బు సర్దుబాటు అయితే, ‘నిబందనలు, అర్హతల పరీక్షలో’ ఉత్తీర్ణులైన లబ్దిదారుల చేతిలో రూ.13,000 పెట్టబోతోంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమాలలో ‘నాడు-నేడు’ కూడా ఒకటి. దానిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేశామని చెప్పుకొంటోంది. మంచిదే. కానీ నాడు-నేడు అంటూ గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు, మళ్ళీ లబ్దిదారులకు ఇచ్చే సొమ్ములో రూ.2,000 కోసుకోవడం దేనికి?

రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణకు విద్యాశాఖ ఏటా వేలకోట్లు ఖర్చు చేస్తోందని చెప్పుకొంటోంది. మరి అమ్మఒడి పధకంలో నుంచి మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాల నిర్వహణకు రూ.2,000 కోత విధించాల్సిన అవసరం ఏమిటి?అంటే ఆ పేరుతో అమ్మఒడి భారం తగ్గించుకొంటున్నట్లా?లేక పాఠశాలల నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఇస్తున్న సొమ్మును అమ్మఒడి లబ్దిదారుల నుంచి తిరిగి వసూలు చేసుకొంటున్నట్లా?అయినా ఏ రాయి అయితేనేమి… పళ్ళు ఊడగొట్టుకోవడానికి?ఇలా ఏడాదేడాదికి పధకాలలో కోతలు విధిస్తూ తగ్గిస్తుంటే, ఆ లబ్ధిదారులే వచ్చే ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయకుండా ఉంటారా? ఆలోచించుకొంటే మంచిది.