YS-Jaganకరోనా రక్కసి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. భారత్ లో దీని పరిస్థితి దారుణంగా ఉంది. ఎంత తీవ్రమంటే తెలంగాణ, మహారాష్ట్ర వంటి మిగులు రాష్ట్రాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీనితో తెలంగాణాలో ప్రజాప్రతినిధుల నుండి పెన్షనర్ల వరకూ జీతాలతో కోత పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే నిజానికి జీతాలు కట్ చేస్తున్నట్టు కాదు. తరువాత పరిస్థితి మెరుగుపడ్డాకా మిగిలిన జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయితే ప్రజలలోకి మాత్రం జీతాలు కట్ చేస్తున్నారు అనే వార్త వెళ్ళింది. అయితే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్భం తెలివిగా వ్యవహరించింది. ఏపీలో జీతాలు కట్ చెయ్యరని రెండు విడతలుగా చెల్లిస్తారని మీడియాకు లీకులు ఇచ్చారు.

అయితే జీవో మాత్రం తెలంగాణ జీవోలానే ఇచ్చారు. నిజానికి ప్రజాప్రతినిధులకు తెలంగాణలో 75% కోత విధిస్తుంటే, ఏపీ లో 100% కోత విధించారు. జీవోలో తెలంగాణ మాదిరి గానే తరువాత చెల్లిస్తాం అని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం తెలివిగా వ్యవహరించడంతో తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత ఇక్కడ రాలేదు.

మీడియా అంతా కరోనా తో బిజీగా ఉండటంతో ఉద్యోగులు మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి అనుభవం కలిగిన కేసీఆర్ కంటే జగన్ తెలివిగా వ్యవహరించారు. స్థానిక ఎన్నికలు ఉండటంతో ఎటువంటి వ్యతిరేకత రాకుండా జగన్ ప్రభుత్వం జాగ్రత్త పడింది అనే చెప్పుకోవాలి.