ys jagan getting relief from ED casesవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఇటీవల సంచలనమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలు కంపెనీల నుంచి ముడుపులు రాబట్టినట్లు జగన్ పై సీబీఐ ఏకంగా 11 కేసులు నమోదై, నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. అంతేకాక ఈ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులు కూడా సీబీఐ కోర్టు విచారణ పరిధిలోకే వచ్చేశాయి. ఈ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసులో కీలక వ్యక్తులుగా పరిగణిస్తున్న ఐఏఎస్ అధికారులు ఒక్కొక్కరుగా ఈ కేసు నుంచి బయటపడుతుండడం ఆసక్తికరమైన పరిణామం.

ఇప్పటికే నాడు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్యాంబాబుపై విచారణను నిలిపివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. తాజాగా జరిగిన విచారణ సందర్భంలోనూ హైకోర్టు మరో కీలక అధికారికి విచారణ నుంచి విముక్తి కల్పించింది. నాడు వైఎస్ హయాంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ పై జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసుపై జరుగుతున్న విచారణకు కూడా దాస్ హాజరు కావాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.