YS_Jagan_Delhiఇరుగు పొరుగు రాష్ట్రాలు సైతం బుగ్గన వేలేసుకొని చూసుకొనేలా రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు శాసనసభలో రూ. 2,79,279 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తమ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతగా అభివృద్ధి చెందిపోతోందో వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ వృద్ధిరేటుఅమాంతం పెరిగిపోయిందని చెప్పుకొన్నారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, వ్యవసాయం, విద్యా, వైద్యం ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సర్టిఫై చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇంత గొప్పగా ఉన్నప్పుడు నెలనెలా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎందుకు జీతాలు చెల్లించలేకపోతోంది? వారు దాచుకొన్న సొమ్ముని కూడా ఎందుకు వాడేసుకొంది?నెలనెలా ఎందుకు అప్పులు చేస్తోంది? అనేవి సమాధానాలు దొరకని భేతాళ ప్రశ్నలని సరిపెట్టుకోకతప్పదు. ఆంధ్రప్రదేశ్‌ పచ్చగా అభివృద్ధి చెందిపోతోందని మంత్రి బుగ్గనతో సహా అందరూ గట్టిగా చెపుతున్నారు కనుక నమ్మి తీరవలసిందే. ఇది వేరే విషయం.

శాసనసభలో బుగ్గన బడ్జెట్‌ ప్రసంగం రాష్ట్ర ప్రజల చెవులలో ఇంకా రింగుమని మారుమ్రోగుతూనే ఉంది. ఇంతలోనే సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈరోజు సాయంత్రం 7.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల అపాయింట్మెంట్ లభిస్తే ఈరోజు లేదా రేపు భేటీ అయ్యి రాష్ట్రానికి రావలసిన నిధుల బకాయిలు, రాష్ట్రానికి సంబందించిన అంశాల గురించి వారితో చర్చినేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నట్లు సమాచారం. ఈనెలాఖరులోగా ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.3,000 కోట్లు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే చెల్లింపులు ప్రారంభించిన్నట్లు సమాచారం. మరో 15 రోజులలో మళ్ళీ ఒకటో తారీఖు వచ్చేస్తుంది. అప్పుడు జీతాలు కూడా చెల్లించాలి. నెలనెలా సంక్షేమ పధకాలు ఉండనే ఉన్నాయి. వాటికీ నిధులు కావాలి. రాజధాని అంశంపై త్వరగా తేల్చమంటే సుప్రీంకోర్టు పట్టించుకోవడం లేదు. కనుక దాని గురించి కూడా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు విన్నవించుకోవలసి ఉంటుంది. కనుక శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం ఎంత సమ్మగా ఉన్నా ఈ కష్టాలు ఎప్పటికీ తీరేవి కావు. కనుక ఢిల్లీ పోయి రావలె!