ys jagan gadapa gadapaku program ఏపీ మంత్రివర్గ విస్తరణ తరువాత నిన్న తొలిసారి సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన ఎగుమతి పాలసీకి ఆమోదం తెలపడం ఓ మంచి నిర్ణయంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేపలు, రొయ్యలు, బియ్యం తదితర ఆహార ఉత్పత్తులు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. వాటి ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుంటుంది. కనుక ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా పాలసీ రూపొందిస్తే మంచిదే. దాని వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. ఇక నిన్న జరిగిన సమావేశంలో పరిశ్రమలు, దేవాలయాలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపారు.

రాష్ట్రంలో నడుస్తున్న అమర్ రాజా బ్యాటరీస్, సంగం, హెరిటేజ్ డైరీ వంటి పలు పరిశ్రమలపై, దివాకర్ ట్రావెల్స్ వంటి సంస్థలపై, సినీ పరిశ్రమపై రాజకీయ కారణాలతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, మరోవైపు పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు విధిస్తుంటే కొత్తవాటికి భూములు కేటాయిస్తే వస్తాయా?అంటే అనుమానమే.

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు రావాలంటే వాటికి ప్రోత్సాహకాలతో పాటు, నిరంతర విద్యుత్, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా నడిపించుకొనే వెసులుబాటు కూడా చాలా అవసరం. పొరుగున తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సానుకూల వాతావరణం ఉంది కనుకనే అక్కడికి దేశవిదేశాల నుంచి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఐటి కంపెనీలు క్యూ కడుతున్నాయి.

‘గడప గడపకు వైసీపీ’ కార్యక్రమంలో మంత్రులు సైతం తమతమ నియోజకవర్గాలలో తప్పసరిగా ప్రతీ ఇంటికీ వెళ్ళి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి డప్పు కొట్టి రావాలని ఈవిషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని సిఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పారు. అలాగే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు.

గడప గడపకు వెళ్ళి సంక్షేమ పధకాల డప్పు కొట్టుకోవడం చాలా తేలికే కానీ ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఈ ప్రభుత్వానికి మిగిలిన రెండేళ్ల గడువు సరిపోదని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రతిపక్షాలు నిత్యం రోడ్లపై ఆందోళనలు చేసి మరీ చాటింపు వేసినట్లు చెపుతుంటే, మళ్ళీ ప్రజలను అడగడం దేనికి? మంత్రులు, ఎమ్మెల్యేలు గడప తొక్కే ముందు వాటిని పరిష్కరిస్తే బాగుంటుంది కదా?