Jagan-Gadapa-Gadapa-Ku-Mana-Prabutvam-Reviewఆంధ్రప్రదేశ్‌లో గత మూడున్నరేళ్ళుగా సంక్షేమ పధకాలు అమలవుతున్నాయి. సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచిపెట్టేస్తున్నాము కనుక లబ్దిదారులు గుడ్డిగా మనకే ఓట్లు వేసేస్తారనుకోలేదు సిఎం జగన్మోహన్ రెడ్డి. ఎంత గొప్ప ప్రోడక్టుకైనా ప్రచారం చాలా అవసరమని లేకుంటే అది అమ్ముడుపోదని తెలిసిన బిజినెస్ మ్యాన్ కనుకనే సంక్షేమ పధకాలకి కూడా ప్రచారం అవసరమని దాని కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

అయినప్పటికీ టీవీలు, పేపర్లలో ప్రకటనలు చూసి జనాలు ఓట్లేస్తారనే నమ్మకం లేకనే గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని వైసీపీ నేతలు, సాక్షి మీడియా గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ ప్రతీ సమీక్షా సమావేశంలో అదెంత గొప్పగా సాగుతోందో బయటపడుతూనే ఉంది.

కనుక జగన్‌ ప్రతీసారి మంత్రులు, ఎమ్మెల్యేలకి గట్టిగా క్లాసు పీకి, ప్రజలలో మీ క్రెడిట్ స్కోర్ రేటింగ్ పెంచుకోకపోతే టికెట్స్ ఆశించకండని పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈసారి ఆ జాబితాలో 38 మంది పేర్లు చదివి, “మీరు మారారా?మారకపోతే మిమ్మల్నే మార్చేస్తానంటూ…” జగన్‌ ఆగ్రహంతో వారిపై చిందులేసినట్లు వార్తలు వచ్చాయి. ఈసారి ఆ జాబితాలో పలువురు సీనియర్ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం. ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలు, విమర్శలు, ఛీత్కారాలను భరించలేకనే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొనడంలేదనేది చేదు నిజం! సమీక్షా సమావేశంలో బుద్ధిగా తలంటించుకొన్న తర్వాత ఇప్పుడు వారు ప్రజల వద్దకు వెళ్ళి మళ్ళీ వారి చేత కూడా మరోసారి తలంటించుకోక తప్పదన్న మాట!

గడప గడపకి కార్యక్రమం లబ్ధిదారులను ఓటర్లుగా ఖరారు చేసుకొనే కార్యక్రమమని చెప్పవచ్చు. కానీ లబ్దిదారులతో సహా వారి చుట్టుపక్కల నివసించే సాధారణ ప్రజానీకం సైతం వారిపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఐదేళ్ళు కనబడకుండా తిరిగి ఎన్నికలప్పుడు ప్రజల చేతిలో తృణమో పణమో పెట్టి ఓట్లేయించుకొనే వెసులుబాటు ఉండగా గడప గడపకి వెళ్ళి తిట్లు కాయడం ఎందుకు? వారి ఎదుటకి వెళ్ళి వారిలో అసంతృప్తిని రాజేసి నష్టపోవడం ఎందుకు?అనే వాదనలు కూడా వైసీపీలో వినిపిస్తున్నాయి.

ఇది ప్రజలు-వైసీపీ నేతల మద్య కధ కాగా, వారికీ అధినేత జగన్‌కి మద్య నడుస్తున్న ఈ కధ కూడా చాలా ఇబ్బందికరంగా సాగుతోందని ప్రతీ సమీక్షా సమావేశంలో స్పష్టం అవుతోంది. తమ జిల్లాలో, నియోజకవర్గాలలో తిరుగేలేదనుకొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు అధినేత క్లాసు పీకుతూ ఇలా అయితే టికెట్లు ఇవ్వనని పదేపదే అందరి ముందు వార్నింగ్ ఇస్తుండటంతో వారు పైకి ఏమీ అనలేకపోయినా వారి అహం దెబ్బ తింటుందని వేరే చెప్పక్కర లేదు. దానికి తోడు టికెట్లు రావనే అనుమానం, ఆందోళన ఎలాగూ ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితే వస్తే వారందరూ వేరేదార్లు వెతుక్కోవడం ఖాయం.

కనుక కనుక ఈ గడప గడపకి కార్యక్రమంతో వైసీపీకి 175 సీట్లు వచ్చేస్తాయనుకొంటే, అదే కార్యక్రమంతో వైసీపీ కొంపములిగేలా ఉందని చెప్పవచ్చు.