ys jagan freebies or developmentఒక అబద్దాన్ని వందసార్లు గట్టిగా చెపితే అదే నిజమైపోతుందంతారు. అలాగే జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్‌ చాలా సుభిక్షంగా ఉందని, ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారని, అందరూ జగన్మోహన్ రెడ్డిని దేవుడిలా పూజిస్తూ ఆయనే ఎప్పటికీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించాలని కోరుకొంటున్నారని ఆయనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే గట్టిగా చెప్పుకొంటుంటారు. రోజూ చెపుతుంటే చివరికి అదే నిజమైపోతుందనే భ్రమలో ఉంటారు.

ఇదొక రకం సర్కారువారి పాట అనుకొంటే, సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ దుష్ట చతుష్టయం అంటూ ఏపీలో ఎవరికీ కనబడకుండా జరిగిపోతున్న అభివృద్ధిని, కనబడుతున్న మంచికి వారు అడ్డుపడిపోతున్నారంటూ సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీలో అందరూ తెగ ఆవేదన పడిపోతున్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు కోనసీమ జిల్లాలో మురమళ్ళలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా సభలో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రానికి మంచి చేయలేదు. కనీసం మేము చేస్తుంటే చూడలేక అసూయతో మమ్మల్ని కూడా అడ్డుకొంటున్నారు,” అని అన్నారు.

రాష్ట్రానికి మంచి చేయడం అంటే ఓట్ల కోసం సంక్షేమ పధకాలు పెట్టి వాటి కోసం ఎడాపెడా అప్పులు చేసి తెచ్చి ప్రజలకు పంచిపెట్టడమా?లేక రాజధాని నిర్మించుకొని, పరిశ్రమలను రప్పించుకొని ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయడమా?

అసలు గత ప్రభుత్వం మొదలుపెట్టిన అమరావతి నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం కొనసాగించి ఉండి ఉంటే, ‘కేవలం ప్రభుత్వాలు మారాయి కానీ అభివృద్ధి విధానం మారలేదనే చక్కటి సందేశం పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు వెళ్ళి ఉండేవి. దాంతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి ఉండేవి. అప్పుడు రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేది.

కానీ మూడేళ్ళపాటు మూడు రాజధానుల పాట పాడటంతో మన రాష్ట్రం వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదేనా…రాష్ట్రానికి మంచి చేయడం అంటే?ఆనాడు అమరావతిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించడానికి చంద్రబాబు నాయుడు పడిన ఆరాటం గొప్పదా?అప్పులు చేసి సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతున్న మన జగనన్న మంచితనం గొప్పదా?ఎవరికి వారు ఆలోచించుకోవలసి ఉంటుంది.