ys jagan fixes dates for cabinet minister swearingఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక పక్క పాలన పైన మరోవైపు తన కేబినెట్ విస్తరణ పైనా దృష్టి పెట్టారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఇప్పుడు ఉన్న జిల్లాలను 25కు పెంచాలని యోచించడంతో ప్రతీ జిల్లాకు ఒక మంత్రి ఉండేలా 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కసరత్తు చాలా వరకూ పూర్తి అయ్యిందని రోజూ పార్టీ సీనియర్లతో చర్చించి జిల్లాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారని సమాచారం.

ఇది ఇలా ఉండగా ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఇవ్వనున్న ఇఫ్తార్‌ విందులో పాల్గొననున్నారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారం గురించి ఆయనతో చర్చినున్నారు. జగన్ ఆదివారం హైదరాబాద్‌లోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న వేదికపై ఈ నెల 8న కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిశాక ఉదయం 11:49 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర నూతన మంత్రివర్గం తొలిసారి సమావేశం కానుంది.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ అదే రోజున తొలిసారి వెలగపూడిలోని సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8:39 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ప్రవేశించనున్నారు. చిన్న మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. వాస్తు మార్పులు కూడా చేస్తున్నారు. ఛాంబర్‌లోకి ప్రవేశించాక జగన్‌ కొన్ని ముఖ్యమైన దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు.