Jagan-మాకు తిరుగులే.. వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మావే… మరో 30 ఏళ్ళ వరకు సిఎంగా జగనే… టిడిపికి, చంద్రబాబు నాయుడుకి ఇవే ఆఖరి ఎన్నికలు… ఎన్నికల తర్వాత జనసేన, పవన్‌ కళ్యాణ్‌లు రాష్ట్రంలో మళ్ళీ కనబడరంటారు… సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు. జాతీయస్థాయిలో తిరుగులేకుండా దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాజకీయాలను శాశిస్తున్న కేసీఆర్‌ కూడా ఏనాడూ ఇంత ధీమా వ్యక్తం చేయలేకపోయారు. కానీ రాష్ట్ర విభజనతో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏమీ చేయకుండానే వైసీపీ నేతలు ఇంత ధీమా వ్యక్తం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే వారి ధీమా మేకపోతు గాంభీర్యమే అని అందరికీ తెలుసు.

సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలకు వెళ్తే ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు దుకాణాలు మూయించేసి, ఎక్కడి కక్కడ బ్యారికేడ్లు, పరదాలు కట్టించేస్తారు. నల్ల దుస్తులు వేసుకొంటే మహిళలని కూడా చూడకుండా చున్నీలు తీయించేస్తారు. సిఎం జగన్‌ సభ అంటే వాలంటీర్లు, డ్వాక్రా సంఘాలు, వెలుగు సంఘాలు అందరికీ భయమే. వెళ్ళకపోతే ఓ బాధ… వెళితే మరో బాధ!

సిఎం జగన్‌ నేను బటన్ నొక్కి రాష్ట్రాన్ని సుభిక్షం చేసేస్తున్నానంటారు. పధకాల నావలో ఎన్నికల వైతారిణి నదిని దాటేయగలమనుకొంటారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా సన్నగిల్లిన్నట్లే ఉంది. అందుకే మూడు రాజధానులతో ప్రజల మద్య విద్వేషాలు రగిలించడానికి కూడా వెనకాడటం లేదు.

మేము అభివృద్ధి చేయబోతే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ అడ్డుకొంటున్నారంటూ విశాఖలో వైసీపీ మంత్రులు గర్జిస్తారు. తిరుపతిలో ర్యాలీలు కూడా చేస్తారు. అసలు వాళ్ళని ఎవరు అడ్డుకొన్నారు? అడ్డుకొంటే ఆగిపోయారా? చేతకాక చేతులెత్తేశారా? అనే అనుమానం కలుగుతుంది.

ఓసారి మా అద్భుతమైన పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని చెపుతుంటారు. మళ్ళీ అదే నోటితో మాకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉంది కానీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ అడ్డుపడుతున్నారంటారు! ఇంతకీ అభివృద్ధి చేసినట్లా చేయనట్లా?

తాము పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయినా అది గత ప్రభుత్వ వైఫల్యమే అంటారు. “అవునా… ఏది… ఎక్కడా చూసొద్దాం…” అని చంద్రబాబు నాయుడు బయలుదేరితే దారిలో బ్యారికేడ్లు ఉంటాయి వాటిని దాటుకొని వెళితే పోలీసులు అడ్డుకొంటారు. పోలవరం ఏమైనా అభయారణ్యమా లేక రక్షణశాఖ అధీనంలో ఉన్న నిషేదిత ప్రాంతమా? అంటే కాదు. కానీ ఎందుకు అడ్డుకొంటున్నారంటే ఆ బ్యారికేడ్లు, పరదాల మాటున ఈ మూడున్నరేళ్ళ తమ వైఫల్యాలని దాచేశారు కనుక!

పోనీ పవన్‌ కళ్యాణ్‌ విశాఖలో రుషికొండను సందర్శించాలనుకొంటే దాని చుట్టూ బ్యారికేడ్లే, పరదాలే. ఓ పెద్ద కొండనే పరదాల మాటున దాచిపెట్టేయాలనుకోవడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లు.

మాకు తిరుగులే.. 175 సీట్లు మావే అంటారు… పవన్‌ కళ్యాణ్‌ నువ్వు ఎన్ని సీట్లలో పోటీ చేస్తావో చెప్పవా? అని అడుగుతుంటారు. టిడిపితో పొత్తులు పెట్టుకొంటావా లేదా క్లారిటీ ఇమ్మనమని అడుగుతుంటారు. 175 సీట్లు వైసీపీయే గెలుచుకొంటున్నప్పుడు ఇక జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తే వాళ్ళకెందుకు?ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకొంటే వైసీపీకి ఎందుకు? అంటే ఆ రెండు పార్టీలు తమ కొంప ఎక్కడ ముంచుతాయనో భయంతోనే కదా?