YS-Jagan-Yarlagadda-Lakshmi-Prasadఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరుని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, తెలుగు భాషా సాధికారిత సంస్థల అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవులకు రాజీనామా చేశారు.

ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినప్పుడు దాని గురించే మాట్లాడి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొనేలా ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించాలి. కానీ ఆయన ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పడుతూనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేస్తూ ‘ఎన్టీఆర్‌ కోసం చేసిందేమీలేదంటూ…’ చాలా ఘాటుగా విమర్శలు చేశారు.

బహుశః అందుకు ‘బావ కళ్ళలో ఆనందం’ కలిగిందో ఏమో ఆయనకు మళ్ళీ వెంటనే మరో ఉన్నత పదవి లభించేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ప్రొఫెసరుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ని నియమిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హిందీ భాష, సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గుర్తింపు, గౌరవంగా ఆయనను ప్రొఫెసరుగా నియమించినట్లు పీవీజీడి ప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హిందీ అకాడమీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కనుక యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ పదవిని కూడా తిరస్కరిస్తారా లేక తన రాజీనామాతోనే ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ వివాదం ముగిసినట్లే అంటూ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ కొత్త పదవి స్వీకరిస్తారా?చూడాలి.

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టిడిపి స్పందిస్తూ, “ఒకవేళ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని అదే పేరును కొనసాగించకపోతే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ దానిని తప్పకుండా మార్చడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్సార్ పేరు కలిగిన సంస్థల పేర్లన్నీ మార్చేస్తామని హెచ్చరించింది. కానీ టిడిపి హెచ్చరికను వైసీపీ పట్టించుకోలేదు. ఎందుకంటే, వచ్చే ఎన్నికలలో తమ పార్టీ 175 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలో కొనసాగుతామనే నమ్మకంతో!