YS Jagan fan gvk reddy disappointed balapur laddu auctionసర్వత్రా ఆసక్తి కలిగించిన బాలాపూర్ లడ్డూ వేలం మరోసారి రికార్డు స్థాయి ధరతో ముగిసింది. కొలన్ రామిరెడ్డి 17 లక్షల 60వేల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది కంటే లక్ష రూపాయలు ఎక్కువగా పలికింది. గ‌తేడాది ఈ ల‌డ్డూను బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూ వేలం తొలిసారిగా 1994లో ప్రారంభమైంది. కొలను మోహన్ రెడ్డి రూ. 450కి వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు.

లడ్డూ బాగా ప్రాచుర్యం పొందింది. అప్ప‌టి నుంచి ప్ర‌తి యేడాదికి రేటు పెరిగిపోతూ వ‌స్తోంది. వేలం పాటలో ఈ ఏడాది 28 మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది లడ్డు పాటలో కేవలం బాలాపూర్ వాసులు మాత్రం పాల్గొనడం సంప్రదాయం. అయితే ఈ సారి వేలం పాటలో పాల్గొనడానికి నాలుగు నాన్ – లోకల్స్ వచ్చారు గత ఏడాది లడ్డు పలికిన 16.6 లక్షల రూపాయిలను డిపాజిట్ గా కట్టి వేలం పాటలో పాల్గొన్నారు. వారిలో పులివెందులకు చెందిన జీవీకె రెడ్డి ఒకరు.

“గత ఏడాది బాలాపూర్ లో స్వామివారిని దర్శించుకుని జగన్ మోహన్ రెడ్డిని సీఎంని చెయ్యాలని కోరుకున్నా. నా కోరికను స్వామి నెరవేర్చడంతో ఈ ఏడాది లడ్డు వేలం పాటలో పాల్గొనడానికి వచ్చా. లడ్డు కనుక వస్తే… తొలుత జగన్ గారికి అందించాలని నా కోరిక,” అని ఆయన వేలం పాటకు ముందు చెప్పారు. అయితే ఈ సారి లడ్డు మళ్ళీ స్థానికుడికే లభించడం విశేషం. రెండు కేజీల వెండి ప్లేటులో పెట్టి నిర్వాహకుల గెలుచుకున్న ఆయనకు లడ్డు అందించారు.