YS Jagan -promisesఅధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారన్నది పక్కన పెడితే, అధికారంలోకి రావడానికి జగన్ మోహన్ రెడ్డి ఏం చేసారన్న అంశాన్ని ప్రముఖ మీడియా ఛానల్ టీవీ5 ఓ కధనాన్ని ప్రసారం చేసింది.

రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ తో కలిసి నాడు ఎలాంటి అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను నమ్మించారో అన్నది ఈ కధనంలోని సారాంశం. ఈ అసత్యపు చిట్టా భారీగా ఉండడంతో, ఈ వీడియో చూసిన వారు నోరెళ్లబెట్టే పరిస్థితి. టీడీపీ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం డేటా చోరీ చేసి ప్రత్యర్థి వర్గం ఓట్లను తొలగించిందని ప్రచారం చేసారు. ఇదే అంశంపై కేవీపీ రామచంద్ర రావు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు ఎటువంటి డేటా చోరీ జరగలేదని స్వయానా కేంద్ర ప్రభుత్వమే తేల్చి చెప్పింది.

తిరుమలలో పింక్ డైమండ్ పోయిందని, అది చంద్రబాబు ఇంట్లో ఉందని నాడు రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిలు ప్రచారం చేయగా, అసలు తిరుమలలో పింక్ డైమండ్ లాంటిదే లేదని స్వయానా ధర్మారెడ్డి లాంటి ధర్మాత్ములే చెప్పారు.

నాడు చంద్రబాబు నాయుడు ఇన్స్ స్పెక్టర్ స్థాయి నుండి డీఎస్పీలుగా 37 మందిని ప్రమోట్ చేయగా, వారంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారేనని ఆరోపించారు. కానీ అందులో కమ్మ వాళ్ళు -2, బీసీలు -9, రెడ్డి – 7, దళితులు -7, కాపు -4, ముస్లింలు -2లకు ప్రమోషన్లు ఇచ్చారు.

ఇక పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పించారు, దీనికి కొంతమంది మేధావులు కూడా వంత పాడారు. పెంటపాటి పుల్లారావు రాసిన లేఖకు బదులుగా పోలవరంలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదని కేంద్ర జనశక్తి మంత్రి స్పష్టం చేసారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు 20% కూడా పోలవరం పూర్తి కాలేదని ప్రచారం చేసిన జగన్, అధికారంలోకి వచ్చిన రెండవ రోజే 71% పూర్తయ్యింది, నిధులు కావాలని అడిగారు. రివర్స్ టెండర్ ద్వారా తక్కువ ధరకే కట్టిస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

కానీ నిజాలు ఏమిటంటే… గతంలో కంటే ప్రధాన డ్యామ్ 1650 కోట్లు, కుడికాలువ ఎత్తిపోతలకు 912 కోట్లు, ఇసుకకు 500 కోట్లు అంచనాలు పెంచారు. మరి రివర్స్ టెండర్ లో తక్కువ వచ్చిందో ఎక్కువ వచ్చిందో ప్రజలే నిర్ణయించుకోవాలి.

కోడి కత్తి కేసులో చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కోడి కత్తితో దాడి చేసిన వారికి బెయిల్ వచ్చింది. పట్టిసీమలో 400 కోట్లు అవినీతి అన్నారు, ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయకపోగా, అదే కాంట్రాక్టర్ కు పోలవరంను అప్పచెప్పారు.

చంద్రబాబు నాయుడు మీద 30 కేసులపై స్టే తెచ్చుకున్నారని ప్రచారం చేసారు. ఒక్క స్టే అయినా చూపించారా? ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసారు, కానీ అఫిడవిట్ లో ఈ కేసుకు, అచ్చెన్నాయుడుకు సంబంధం లేదని రాసారు.

ఇక అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రచారం చేసారు. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ నుండి రాజధానిని తరలించను అని చాలామంది మాట్లాడారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు.

ఇదంతా ప్రశాంత్ కిషోర్ ఆడించిన అబద్ధాల పుట్టగా అభివర్ణించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడంలో దిట్టగా మారారని అన్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ బ్రోకర్స్ ను అస్సలు నమ్మవద్దంటూ సంచలన ప్రకటన చేసారు.

ప్రజాసేవ పేరుతో రాజకీయ పార్టీలు పెట్టి, వాటికి స్ట్రేటజీలు ఏంటి? మీది ఏమైనా మల్టీ నేషనల్ కంపనీనా? అంటూ సదరు షో నిర్వాహకుడు సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అల్లిన ఈ అసత్యపు ప్రచారాలను షేర్ చేసుకుంటూ తెలుగు తమ్ముళ్లు సందడి చేస్తున్నారు.