YS Jaganరాష్ట్రంలోని నిరుద్యోగులకు తమ ఉద్యోగ ప్రయత్నాలలో, స్కిల్ డెవలప్మెంట్ లో పనికి వచ్చే విధంగా నెలకు 2000 రూపాయిలు ఇచ్చే పథకం నిరుద్యోగ భృతి. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం అటకెక్కించిందా అనే అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. సహజంగా ప్రతీ నెల ఒకటి రెండు తారీఖులలో పడే ఈ సొమ్ము ఈ నెల ఇప్పటివరకూ పడలేదు. ఇప్పటివరకూ దీనిమీద ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం లేదు.

దాదాపుగా 14 లక్షల యువత దీనిపై ఆధారపడి ఉన్నారు. రోజూ దీని మీద 1100కి వేలలలో కాల్స్ వస్తున్నాయట. అయితే వారిదగ్గర కూడా సరైన సమాచారం లేకపోవడంతో వారంతా నిరాశ చెందుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు లో ఉన్న చాలా పథకాల పేర్లు మారుస్తున్నారు. కొన్ని పథకాలు పూర్తిగా రద్దు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాలేదు అనే పేరుతో ఈ పథకాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.

3000 రూపాయిల పెన్షన్ ఇస్తామని ఇప్పుడు కేవలం 250 రూపాయిలు పెంచిన ప్రభుత్వం ఈ నెల ఆ మొత్తం కూడా ఇవ్వలేకపోయింది. గత నెలలాగే ఈ నెలలో కూడా పెన్షన్ దారులకు 2000 రూపాయిలే అందాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోతే గతంలో చంద్రబాబు కూడా ఇటువంటి పరిస్థితిలోనే ఏ పథకమూ ఆగకుండా బండి నడిపించారు కదా అని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఈ భావన ప్రజలలో కొనసాగితే అది కొత్త ప్రభుత్వానికి ఇబ్బందే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.