YS Jagan eyes on endowment assetsఉగాది లోగా పెద్ద ఎత్తున పేదలకు భూములు పంచాలని జగన్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఉన్న ప్రభుత్వ భూములు చాలా తక్కువ కావడం, అలాగే కొత్తగా భూములు కొని పంచే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడంతో దేవాదాయ భూములపై కన్నేసింది ప్రభుత్వం. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఎకరాలున్నట్లు దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో కొంత అర్చకుల ద్వారా సాగులో ఉంది. అనేకచోట్ల దుకాణ సముదాయాలు వంటివి నిర్మించి అద్దెలకు ఇచ్చారు.

నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండే భూములను గుర్తించి, ఇళ్లస్థలాల పంపిణీకి వినియోగించాలని అధికారులు చూస్తున్నారు. అయితే గతంలో ఆలయ భూములను ఇతరులకు విక్రయించడానికి వీల్లేదంటూ గతంలో హైకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చింది. నీటిపారుదల పథకాలు, జాతీయ రహదారుల విస్తరణకు మాత్రం తీసుకోవచ్చని మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలో ఈ తీర్పును బైపాస్ చేసి ఎలాగైనా ఈ భూములను పేదలకు భూములు పథకం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.

నిరర్ధకంగా ఉండటం వల్ల అన్యాక్రాంతమవుతున్న ఈ భూములను విక్రయించడం లేకపోతే ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడమే మెరుగు అనే పాయింట్ మీద అవసరమైతే కోర్టుకు వెళ్లి అనుకూలమైన తీర్పు తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే గతంలో ఇదే పాయింట్ మీద చంద్రబాబు ప్రభుత్వం చెన్నైలోని సదవర్తి భూములు అమ్మదలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. కోర్టుకు కూడా వెళ్ళింది. ఇప్పుడు అదే పని ఎలా చేస్తుందో చూడాలి.