Ys Jagan Experiments on the Education Systemఆంధ్రప్రదేశ్‌ విద్యావ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణల పేరుతో చేస్తున్న ప్రయోగాలతో నిరుపేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో భోదన, పాఠశాలల విలీనాలు, బైజూస్ ఆన్‌లైన్‌ పాఠాలతో ప్రాధమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకు విద్యా వ్యవస్థలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇవి సరిపోవన్నట్లు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మొబైల్ ఫోన్లలో ఫెసియల్ రికగ్నిషన్ ద్వారా హాజరువేసే విదానాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం‌ నిర్ణయించింది. దీని కోసం ఈ నెలాఖరులోగా విద్యార్థులందరి పేర్లు, వివరాలు, ఫోటోలు అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఉపాధ్యాయులకు విద్యాభోదన కంటే ఇతర కార్యక్రమాలు అంటే… ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం తమ మొబైల్ ఫోన్లలో ఫెసియల్ రికగ్నిషన్ ద్వారా హాజరువేసుకోవడం, పాఠశాలలో టాయిలెట్లు, వంటగది, తరగతి గదుల ఫోటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం వంటి పనులు పెరిగిపోయాయి. అవన్నీ ప్రతీరోజూ తప్పనిసరిగా చేయకపోతే చర్యలు ఉంటాయి. జీతల కోతలు ఉంటాయి.

ఇక ‘బైజూస్ ఆన్‌లైన్‌ పాఠాలు’ మరో పెద్ద కధ. ఇవన్నీ సరిపోవన్నట్లు ప్రతీ పాఠశాలలో విద్యార్థులందరికీ ప్రతీరోజు ఉదయం సాయంత్రం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరుతీసుకొని అప్‌లోడ్‌ చేయడం అంటే ఎంత పనో ఊహించుకోవచ్చు. ఈ లెక్కన విద్యార్థులకు పాఠాలు ఎప్పుడు చెప్పాలి? సిలబస్ ఎలా పూర్తిచేయగలమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థ మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తూ మరోపక్క అత్యుత్తమైన ఫలితాలు రావాలని కోరుకొంటే ఎలా సాధ్యం?అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

పోనీ ఇంత చేస్తున్నా సకాలంలో ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందా? అంటే అదీ లేదు. ఈ నెల జీతాలు ఆలస్యమైనందుకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయాల ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపారు.

కానీ అమ్మ ఒడి వంటి పధకాలతో విద్యావ్యవస్థని లింక్ చేసినందున, ఆ భారం తగ్గించుకొనేందుకు లేదా లబ్దిదారులు వైసీపీ గుప్పెట్లో నుంచి జారిపోకుండా ఉండేందుకే వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థ మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పవచ్చు. అంటే వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యావ్యవస్థని ప్రయోగాల పేరుతో భ్రష్టు పట్టించేస్తుంటే రాబోయే రోజుల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడటం మాట అటుంచి విద్యలో పూర్తిగా వెనుకబడిపోయి చివరికి విద్యకు పూర్తిగా దూరమయిపోయే ప్రమాదం కనిపిస్తోంది.