YS Jagan PRCఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది. కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకుంటే తప్ప చర్చలకు వచ్చేది లేదు అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. అయితే పీఆర్సీ జీవోలు నిలుపుదల కుదరదని.. ముందుగా చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలమని ప్రభుత్వం అంటుంది.

సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు. ఉద్యోగుల బుజ్జగింపుకు ప్రభుత్వం నియమించిన కమిటి పని చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చర్చలకు పిలిచిన మొదటి రోజు సంఘాల నాయకులు రాలేదని, సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు.

రేపు కూడా వారితో చర్చలకు వేచిచూస్తామని తెలిపారు. అయితే ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతల వాదన మాత్రం భిన్నంగా ఉంది.

“ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటిని నియమిస్తూ ఎటువంటి జీవో ఇవ్వలేదు. అంటే దానికి చట్టబద్ధత లేదు. పైగా ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే కమిటీ ఏర్పాటైందని సజ్జల డైరెక్ట్ గానే చెబుతున్నారు. ఇక చర్చలకు వెళ్లి ఏం ఉపయోగం?,” అని వారు ప్రశ్నిస్తున్నారు.

“ఏదో రకంగా సంఘాలను మచ్చిక చేసుకుని సమ్మెకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వ వ్యూహం. అదే సమయంలో మా డిమాండ్లను చర్చించే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు. తాము చర్చలకు పిలుస్తుంటే రావట్లేదు అని ప్రజల దృష్టిలో దోషులను చేసే ప్రయత్నం చేస్తున్నారు,” అని వారు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ వైఖరి వైఎస్సార్ కాంగ్రెస్ సమర్ధకులను కలవరపెడుతుంది. “ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగస్తులు, వారి కుటుంబాలు కలిసి దాదాపుగా 60 లక్షల ఓటర్లు ఉంటారు. ఏపీలో మొత్తం ఓటర్లు నాలుగు కోట్ల ఏడు లక్షలు. వీరు వన్ సైడ్ అయితే ఎన్నికల ఫలితాలు కూడా వన్ సైడ్ కావడం ఖాయం,” అని ఆందోళన చెందుతున్నారు.

ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ సాధన సమితి పేరుతో.. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.