Supreme-Court-Unlikely-To-Fulfill-YS-Jagan's-Wishరాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏకపక్షంగా ఇచ్చిన స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని కొట్టివెయ్యాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన రిట్ పిటీషన్ ఈరోజు విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది

ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని, ఎన్నికలు ఎప్పుడు నిర్ణయించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుదినిర్ణయమని స్పష్టం చేసింది. అయితే జగన్ ప్రభుత్వానికి స్వల్ప ఊరట కలిగిస్తూ… ఎన్నికల ప్రవర్తన నియమావళిని సుప్రీంకోర్టు రద్దు చేసింది.

ఇప్పటికే ప్రకటించిన పథకాలు చేప్పట్టవచ్చని చెప్పింది. దీనితో ఉగాదికి ఇళ్ళ పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. అయితే ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఓటర్లను ప్రభావితం చేసేలా ఎటువంటి కొత్త పథకాలను ప్రకటించవద్దని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

స్థానిక ఎన్నికలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగాలనే పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా కరోనా విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం స్కూళ్లకు కూడా హాలిడేస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ విషయంలో ఒక క్లారిటీ రావడంతోనైనా ప్రభుత్వం కరోనా విషయంలో వేగంగా స్పందిస్తుందేమో చూడాలి.