Ys Jagan Election Commission president Seatమనది ప్రజాస్వామ్య దేశమే కానీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు, ఇంకా చెప్పాలంటే జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతటా రాచరిక పోకడలే కనిపిస్తుంటాయి. అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పటికీ మేము, మా పిల్లలే అధికారంలో ఉంటామని, వేరెవరూ తమ రాజ్యాలలో ప్రవేశించకూడదని చెప్పకనే చెపుతుంటాయి.

ఒకరు రాజ్యాంగం మార్చేస్తానంటే, మరొకరు 175 సీట్లు మాకే అంటారు. మరొకరు దేశంలో ఒకే ఒక పార్టీ ఉండాలి అది మాదే అయ్యుండాలని అంటారు. వాటికే పూర్తి అధికారం ఉండి ఉంటే దేశంలో ఎన్నికల వ్యవస్థను ఎప్పుడో రద్దు చేసేసి, వంశపారంపర్య పరిపాలన ప్రారంభించేసి ఉండేవే. కానీ అయిష్టంగానైనా ప్రజాస్వామ్య ముసుగులు ధరించి నటించవలసివస్తోంది. కానీ ముసుగు తొలగినప్పుడల్లా ఆ రాజరిక పోకడలు స్పష్టంగా కనబడుతుంటాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ ప్లీనరీ సభలో గౌరవాధ్యక్షురాలు విజయమ్మను బయటకి సాగనంపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి శాశ్విత అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసుకొన్న సంగతి తెలిసిందే. కానీ మనది ప్రజాస్వామ్య వ్యవస్థ కనుక పట్టాభిషేకాలు చేసుకొని ఎల్లకాలం కుర్చీకి అతుక్కుపోయి కూర్చోంటానంటే కుదర్దని కేంద్ర ఎన్నికల కమీషన్‌ వైసీపీకి లిఖిత పూర్వకంగా తెలియజేసింది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలలో శాశ్విత అధ్యక్ష పదవి నిబందనలకు విరుద్దం కనుక తప్పనిసరిగా ప్రతీ రెండేళ్ళకు కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోవలసిందే అని స్పష్టం చేసింది. అంతే కాదు… శాశ్విత అధ్యక్ష పదవి గురించి మీడియా ద్వారా మరోసారి స్పష్టత ఇవ్వాలని కూడా సూచించింది.