YS Jagan - ego hurtsకేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కరోనా వైరస్ హాట్ స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 11 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇది ప్రతిపక్షాల చేతిలో ఆయుధంగా మారింది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ జిల్లాలు హాట్ స్పాట్స్ గా ఉండటం ప్రభుత్వ వైఫల్యమే అంటూ ఆక్షేపించాయి.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిసింది. కొన్ని రాష్ట్రాల్లోని జిల్లాల విస్తీర్ణం కంటే ఇక్కడ ఎక్కువగా ఉంది. జనాభా కూడా ఎక్కువే. ఈ పరిస్థితుల్లో మొత్తం జిల్లాను హాట్ స్పాట్ గా ప్రకటించడం భావ్యం కాదని పేర్కొంది. మండలాల ప్రాతిపదికన తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తక్కువే అని చెప్పుకొచ్చింది.

“జాతీయస్థాయిలో 6.2 రోజులకు కేసులు రెండింతలు అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో 2.5 రోజులు, గుంటూరు జిల్లాల్లో 3.3 రోజులు, చిత్తూరు జిల్లాలో 3.7 రోజులు, అనంతపురం జిల్లాలో 3.9 రోజుల్లో కేసులు రెండింతలు పెరిగినట్లు శనివారం వరకు ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది,” అంటూ లేఖలో పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లోని 676 మండలాలలో 97 మండలాలను మాత్రమే రెడ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన మండలాలలో రేపటి నుండి కేంద్రం ఇచ్చిన లొక్డౌన్ సడలింపులు వర్తిస్తాయి. రెడ్ జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్ జోన్ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజులపాటు పాజిటివ్ కేసు ఒక్కటీ నమోదు కాకుంటే అప్పుడు గ్రీన్ జోన్ పరిధిలోకి మండలం చేరినట్లు ప్రకటిస్తారు.