YS Jagan Early Elections Andhra Pradeshఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేసారు. బుదవారం నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ తీరు చూస్తుంటే తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సూచనలు కనిపిస్తోంది. 2023లో మొదట మే నెలలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు తర్వాత డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక వైసీపీ ప్రభుత్వం ఆ రెండు నెలల్లో ఎప్పుడు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తే అప్పుడు ఎన్నికలకు వెళ్ళవచ్చు. కనుక ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు టిడిపిలో అందరూ సిద్దంగా ఉండాలి. వైసీపీ ఏర్పాటు చేసుకొన్న వాలంటీర్ వ్యవస్థతో, అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో వచ్చే ఎన్నికలలో గెలవాలని ప్రయత్నించవచ్చు. కనుక పార్టీలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ నిత్యం ప్రజల మద్యనే ఉండాలి. ఇక నుంచి నేను కూడా ప్రజల మద్యనే ఉంటాను,” అని చెప్పారు.

వైసీపీ వర్గాలలో ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. సిఎం జగన్మోహన్ రెడ్డి జాతకం ప్రకారం 2023 మార్చిలోగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన్నట్లయితే నూటికి నూరు శాతం విజయం సాధిస్తారని అదే 2023 మే తర్వాత నుంచి డిసెంబర్‌లోగా వెళితే ఎన్నికలలో 50:50 శాతం అవకాశం మాత్రమే ఉంటుందని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు సలహా ఇచ్చారని కనుక మార్చి నెలాఖరులోగానే ముందస్తుకి వెళ్ళే అవకాశం ఉందని దాని సారాంశం.

అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి ముందుగా గత ఎన్నికలలో టిడిపి గెలుచుకొన్న నియోజకవర్గాలపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఆనాడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమం కూడా ప్రారంభించాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.

ఇక సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన 175 సీట్లు పాట కూడా ప్రజలకు బాగానే చేరుతుండటంతో, ఇకపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా 175 సీట్ల పాటను మరింత బిగ్గరగా పాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లయితే, ఎన్నికలనాటికి ప్రజలు కూడా వైసీపీయే గెలుస్తుందని గట్టిగా నమ్మడం ప్రారంభిస్తారని అప్పుడు 175 రాకపోయినా మళ్ళీ 151 సీట్లు వస్తాయని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. మరి టిడిపి, జనసేనలు ఏవిదంగా సిద్దం అవుతాయో చూడాలి.