KCR-YS Jaganతొమ్మిది, పది షెడ్యూలు సంస్థల స్థితిగతులపై ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. రెండు వైపులా వారు తమ తమ వాదనలను వినిపించారు. అప్పులు జనాభా నిష్పత్తిలో పంచారు కాబట్టి ఆస్తులు కూడా అలాగే పంచాలని ఆంధ్రప్రదేశ్ వాదన అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆస్తులు ఎక్కడ ఉంటే అవి ఆ రాష్ట్రానికే చెందుతాయని వాదిస్తుంది. దీనితో ఎక్కువ ఆస్తులు హైదరాబాద్ లో ఉండటం వల్ల తెలంగాణకు లాభం. ముఖ్యమంత్రుల భేటీలో కూడా కేసీఆర్ ఇదే వాదన వినిపించినట్టు సమాచారం.

అయితే వివిధ సంస్థల బ్యాంకు అకౌంట్స్ లో ఉన్న డబ్బు మాత్రం జనాభా నిష్పత్తిలో పంచుకోవడానికి ఒప్పుకున్నారట. అయితే ఈ ప్రొపోజల్ పై సమాలోచనలు జరిపిన ముఖ్యమంత్రి జగన్ దీనివల్ల రాష్ట్రానికి నష్టమని భావిస్తున్నారట. దీనికి ఒప్పుకుంటే రాజకీయంగా కూడా నష్టపోయే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఈ క్రమంలో ఈరోజు గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల సమావేశం జరపాలని భావించినా అది వాయిదాపడింది.

ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన అనంతరం తుది నిర్ణయాలతోమాత్రం గవర్నర్‌ వద్దకు వెళ్లాలని జగన్ తెలంగాణ ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియాలో వచ్చిన ఈ వార్తలు గనుక నిజమైతే అది ఆంధ్రప్రదేశ్ కు మంచిదే అనుకోవాలి. అదే సమయంలో ఎన్నికల అనంతరం మొట్టమొదటి సారిగా జగన్ కు కేసీఆర్ మీద అనుమానం మొదలయ్యినట్టు కనిపిస్తుంది. ఈ పరిణామం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.