“మాట తప్పను… మడమ తిప్పను…” అనే స్లోగన్ తో ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారం వచ్చిన నాటి నుండి ఆ స్లోగన్ కు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారనేది పొలిటికల్ టాక్.

వృద్ధుల పెన్షన్ మొదలుకుని అనేక సందర్భాలలో జగన్ తన వైఖరిని మార్చుకుంటున్న వైనం బహిరంగమే! తాజాగా అందులోకి మరొక అంశం వచ్చి చేరింది. వ్యవసాయ చట్టాలను రూపొందించిన మోడీ సర్కార్ విధానాన్ని తొలుత నెత్తిన పెట్టుకుంది వైసీపీ.

పార్లమెంట్ లో కూడా తాము మద్దతు పలుకుతున్నట్లుగా ప్రకటించింది. అలాగే పోరాటాలు చేస్తున్న వారంతా రైతులు కాదు, దళారులు అంటూ నిందలు వేస్తూ బీజేపీకి వంత పాడింది. అయితే తమ తప్పు తెలుసుకున్న బీజేపీ ఏకంగా రైతులను క్షమించమని అడిగేసింది.

కానీ వైసీపీ మాత్రం మడమ తిప్పేసింది. నాడు మద్దతు పలికిన వైసీపీ, నేడు చట్టాలను బీజేపీ రద్దు చేయడంతో, మొదట నుండి తాము ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు రాసేసింది. ఇలాంటి సందర్భాలలో నెటిజన్లు మాత్రం సైలెంట్ గా ఉండరు కదా!

నాడు వైసీపీ సర్కార్ చేసిన వ్యాఖ్యలు, పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి అండ్ కో ఇచ్చిన మద్దతు ఫోటోలను పోస్ట్ చేస్తూ… నేడు మడమ తిప్పిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ తెలుగు తమ్ముళ్ళతో సహా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఒక రాజకీయ పార్టీగా తమకంటూ ఒక సిద్ధాంతం లేకుండా గాలి ఎటు వీస్తే అటు వైపుకు తిరిగి, తద్వారా రాజకీయ లబ్ది పొందడమే లక్ష్యంగా వైసీపీ వెళుతోందని పొలిటికల్ వర్గాలు కూడా విశ్లేషణలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ‘డబుల్ గేమ్’ ధమాకాలు… ఇలాంటివి రానున్న రెండేళ్ళల్లో ఇంకెన్ని ఆవిష్కృతం అవుతాయో?!