YS Jagan Distribues House Site Pattasవైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరిస్తే టిడిపి నేతలకు, కమ్మవారికి భారీగా లబ్ది కలుగుతుందనే ఆలోచనతోనే దానిని పక్కన పడేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇదేమీ రహస్యం కాదు. సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ స్వయంగా పలుమార్లు చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మన అమరావతి అంటుండటం గమనిస్తే మళ్ళీ ఏదో కొత్త వ్యూహానికి తెరలేపిన్నట్లే ఉంది.

అమరావతిలో సెంటు భూముల పంపిణీ కార్యక్రమంలో సిఎం జగన్‌ ప్రసంగిస్తూ, “ఇవి కేవలం ఇళ్ళ పట్టాలు మాత్రమే కావు. సామాజిక న్యాయ పత్రాలు కూడా. ఇప్పుడు ఈ అమరావతి సామాజిక అమరావతిగా మారింది,” అని అన్నారు. అమరావతి మీద టిడిపి, కమ్మ ముద్రలు వేసిన జగన్ ప్రభుత్వానికి, ప్రజలను మతమార్పిడి చేసిన్నట్లు ఒక ఊరుని కూడా సామాజిక మార్పిడి కూడా చేయవచ్చనే గొప్ప ఆలోచన కలగడం విశేషమే కదా? అసలు అమరావతినే వద్దనుకొన్నప్పుడు మళ్ళీ దానిని ఈవిదంగా సామాజిక మార్పిడి చేయాల్సిన అవసరం దేనికి?అంటే ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసమే అని భావించవచ్చు.

సెంటు భూముల పంపిణీని నిరసిస్తూ నేడు రాజధాని రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ, “మేము 1,240 రోజులుగా ఇక్కడ టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తున్నాము. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలను, అవ్వతాతలను అందరికీ నేనున్నానని గొప్పగా చెప్పుకొనే సిఎం జగన్మోహన్ రెడ్డి ఏనాడు మమ్మని పిలిచి మాట్లాడలేదు. కనీసం మాపట్ల సానుభూతి చూపలేదు. మాకు న్యాయం చేయకపోగా మాపై ద్రోహులు, కుట్రదారులు అంటూ ముద్రలు వేసి అవమానిస్తున్నారు. మూడు రాజధానులు కారణంగా రోడ్డున పడ్డ మమ్మల్ని గాలికి వదిలేసి, మేమిచ్చిన భూములను వేరేవారికి పంచిపెడుతూ నా అంత మంచివాడు లేడని గొప్పలు చెప్పుకొంటున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

“మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు నిర్దేశించిన ప్రాంతంలో జగన్ ప్రభుత్వం లేఅవుట్లు వేసి సెంటు భూములుగా విభజించి పంచిపెడుతోంది. కానీ అక్కడ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏర్పాటు చేసి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేస్తూ రాష్ట్రంలో యువత భవిష్యత్‌ని కూడా దెబ్బ తీస్తున్నారు కదా? అమరావతిని ఓ పద్దతి ప్రకారం విచ్ఛిన్నం చేసేందుకే జగన్ ప్రభుత్వం సెంటు భూములు పంచిపెడుతోంది.

వాటిని పంచి పేదలను ఆదుకొంటున్నామని చెపుతున్న సిఎం జగన్‌కు పావు ఎకరం, అర ఎకరం, కొన్ని సెంట్ల భూములలో వ్యవసాయం చేసుకొనే 15 వేలమంది రైతులు పేదలుగా భావించడం లేదా?మావంటి పేదవారి పొట్టకొట్టి మరో పేదవారిని ఆదుకోవడం ఏమిటి?కోర్టు తుదితీర్పుకు లోబడి ఉన్న భూములను పంచిపెడుతూ జగన్‌ వారిని కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏవిదంగా రోడ్డున పడ్డామో రేపు వారందరూ కూడా తప్పక రోడ్డున పడతారు. అప్పుడు జగన్‌ వచ్చి వారిని ఎవరు ఆదుకొంటారా?” అని ఆందోళనలు చేస్తున్న రైతులు ప్రశ్నిస్తున్నారు.