Kommineni Srinivasa Raoసీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు గత కొన్ని సంవత్సరాలుగా జగన్ కు వీర మద్దతుదారుగా నిలిచారు. పొద్దునే వచ్చే తన పాపులర్ టాక్ షోలో అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టి ప్రతిపక్షం ఎజెండాను బుజాల మీద మోసేవారు. అయితే ఆ తరువాతి కాలంలో ఎన్టీవీ ఆయనను తప్పించగా అది టీడీపీ ప్రభుత్వం కుట్ర ఆయన ఆరోపించారు.

అయితే జగన్ ఆయనను వెంటనే అక్కున చేర్చుకుని సాక్షిలో అదే స్థాయి పదవి, అదే టైమింగ్ లో టాక్ షో స్లాట్ ఇచ్చారు జగన్. జగన్ సొంత ఛానల్ లో నౌకరీ కావడంతో ఇక కొమ్మినేని మరింత చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ విజయంలో ఆయన వంతు చిన్న సాయం కొమ్మినేని కూడా చేశారు. ఎన్నికల అనంతరం తనకు సాయం చేసిన వారందరికీ ఏదో ఒక పదవి ఇచ్చి ఋణం తీర్చుకున్నారు జగన్.

ఈ క్రమంలో కొమ్మినేనికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కొమ్మినేని కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పదవిని వేరొకరికి ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాధరెడ్డి నియమితులు కానున్నారు. 28 ఏళ్లుగా ఆయన జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. వివిధ పత్రికల్లో పని చేసిన అనుభవం ఉంది.

అదే విధంగా 2014 నుండి సాక్షి పొలిటికల్ సెల్ సలహాదారుడిగా పని చేసారు. ఈ నిర్ణయంతో కొమ్మినేని బాగా నిరాశపడినట్టు సమాచారం. కమ్మ కులానికి చెందిన వారు కావడంతోనే తనకు అవకాశం రాలేదని ఆయన వాపోతున్నారని కొందరు అంటున్నారు. ఇది ఇలా ఉండగా జగన్ చేసిన సాయాన్ని మర్చిపోరని కొమ్మినేనికి ఏదో ఒకటి ఇస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి మీద భారీ ఆశలు పెట్టుకున్న కొమ్మినేని మాత్రం నిరాశగానే ఉన్నారు.