YS Jagan did not learn anything from his father says Chandrababu Naiduప్రముఖ జర్నలిస్ట్ కందుల రమేష్ రచించిన ‘అమరావతి వివాదాలు-వాస్తవాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఆయన మనసులో ఆవేదనకు అద్దం పట్టింది. అందరినీ ఆలోచింపజేస్తుంది కూడా.

“ఏ రాజకీయ నాయకుడు శాస్వితంగా ఉండడు కానీ అతను చేసిన పనులే శాస్వితంగా నిలిచి ఉంటాయి. మన పాలనతో మనకు రాజకీయ లబ్ధి కలిగిందా లేదా… అనేది ముఖ్యం కాదు. మన వలన రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా మేలు కలిగిందా లేదా… అనేదే చాలా ముఖ్యం. అప్పుడే మన తదనంతరం కూడా ప్రజలు మనల్ని గుర్తుచేసుకొంటారు.

ఒక ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను, మొదలుపెట్టిన పనులను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అమలుచేస్తాయి. ఆనాడు నేను సైబరాబాద్‌, శంషాబాద్‌ విమానాశ్రయానికి భూములు సేకరించి పనులు మొదలుపెట్టాను. నా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాటిని యదాతధంగా కొనసాగించారు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చినవారు కూడా వాటిని కొనసాగించడం వలననే నేడు హైదరాబాద్‌ ఇంతగా అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రానికే అక్షయపాత్రగా నిలిచింది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి కూడా అటువంటి గొప్ప రాజధాని ఉండాలనే ఆలోచించి రాష్ట్రానికి మద్యలో అమరావతిని నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని చెపుతూ, ఆ ప్రయత్నంలో ఎదురైన సమస్యలు, రైతులతో చర్చలు, వారు భూములు ఇవ్వడం, సింగపూర్‌ సహాయసహకారాల గురించి చంద్రబాబు నాయుడు వివరించారు. కానీ తన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తనపై వ్యక్తిగత, రాజకీయ ద్వేషంతో రాజధాని అమరావతి పనులను నిలిపివేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మనసు నిండా ద్వేషం నింపుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తాను మొదలుపెట్టిన పనులన్నిటినీ ఎక్కడివాక్కడ నిలిపివేశారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డి కనీసం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఏమీ నేర్చుకోలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి కోసం సామాన్య రైతులు తమ జీవనోపాధి అయిన భూములను త్యాగం చేస్తే జగన్ వారి త్యాగాలకు విలువ, గౌరవం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ళుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నా సిఎం జగన్ వారిని పట్టించుకోవడంలేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నా జగన్ ప్రభుత్వం దానిని పూర్తి చేయలేక చేతులు ఎత్తేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌కు అత్యంత కీలకమైన అమరావతిని, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయకుండా సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నాడని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.