ys jagan delhi tourఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేటి నుండి రెండు రోజుల వరకు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా సీఎం జగన్ కు అప్పాయింట్మెంట్ లభించినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి.

అయితే ఈ ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏమిటన్నది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఇలాంటి చర్చ తెరమీదకు రావడం సాధారణమైపోయింది. అధికారం పక్షం ఏమో… రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, పోలవరం, మూడు రాజధానుల ఆవశ్యకత ఇలా ఏపీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం చర్చలకు వెళ్లారని చెప్తుంటుంది.

ప్రతిపక్షం ఏమో జగన్ కు సంబంధించిన కేసుల నేపధ్యంలో ఢిల్లీకి వెళ్తున్నారని, గతంలో బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ తుది తీర్పు వెలువడనున్న సమయంలో జగన్ ఢిల్లీ వెళ్లారని గుర్తు చేస్తూ అధికార పక్షంపై ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఇంకా కోర్టు తీర్పు పెండింగ్ లోనే ఉందని ఆర్ఆర్ఆర్ తన రచ్చబండ కార్యక్రమంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఉంటున్నారు.

ఇక కేంద్ర పరిశీలనలో ఉన్న అంశమేమిటంటే… ఏపీలో ఆర్ధిక క్రమశిక్షణ ఉండడం లేదని ఫిర్యాదులు వెలువడుతున్న నేపధ్యంలో, ఈ విషయం పైన చర్చ జరిగే అవకాశం ఉంటుందనేది ఓ టాక్. దీనికి సంబంధించి కాగ్ నివేదికల వంటి పలు విశ్లేషణలు కూడా కేంద్ర పరిధిలో ఇప్పటికే కొలువై ఉన్నాయి. ఏది ఏమైనా అధికార పక్షం చెప్పే వివరణ మాత్రం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందనేది టీడీపీ ఆరోపణ.