ys jagan delhi tour met narendra modiఏపీ, తెలంగాణతో దేశంలో 13 రాష్ట్రాలు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వలన విద్యుత్‌ ఎక్స్‌చేంజ్‌ నుంచి రాష్ట్రాలకు అవసరమైన విద్యుత్‌ కొనుగోళ్ళు, మిగులు విద్యుత్‌ అమ్మకాలు జరుపకుండా కేంద్రం నిషేదం విధించింది. కానీ ఏపీ డిస్కంలు అణాపైసాలతో సహా ఎప్పుడో బాకీలు చెల్లించేశాయని కానీ కమ్యూనికేషన్ లోపం వలననే ఈవిదంగా జరిగిందని, తాము వెంటనే ఈవిషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి తెలియజేయడంతో, నిషేదిత జాబితా నుంచి ఏపీ పేరును తొలగించిందని ఏపీ విద్యుత్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ మూడు రోజుల క్రితమే చెప్పారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో భేటీ కానున్నారు. ఏపీ విద్యుత్‌ బకాయిలు చెల్లించేసినట్లయితే సిఎం జగన్ ఆయనతో భేటీ అవడం దేనికో?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈరోజు ఉదయం సిఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యి పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, నిర్వాసితులకు పునరావాసం కోసం చెల్లించాల్సిన రూ.20,000 కోట్ల ప్యాకేజీ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టుకి ఇక నిధులు ఇవ్వలేమని 4-5 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలుకొట్టినట్లు చెప్పేసింది. 2017-2018 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టగా కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కలను, అంచనా వ్యయాన్ని నిర్ద్వందంగా తిరస్కరించి, 2013-14 ధరల ప్రకారమే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లు మాత్రమే అని నిర్దారించింది.
దానిలో ఇప్పటికే రూ.12,747.16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించినందున మిగిలిన రూ.2,920.74 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ వివరాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) డ్యాష్‌ బోర్డులో పొందుపరిచింది.

ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతాల చెల్లింపులు, పింఛనులు, సంక్షేమ పధకాలకు చెల్లింపులకే సొమ్ము లేక వైసీపీ ప్రభుత్వం చాలా అవస్థలు పడుతోంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి కూడా కేంద్రం నిధులు ఇవ్వకపోతే, ఇప్పుడు నత్తనడకన సాగుతున్న నిర్మాణ పనులు కూడా నిలిచిపోతాయి.కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ కలిసినప్పుడు పోలవరంకి నిధులు ఇవ్వమని అడగడం సహజమే.

కానీ నిధులు ఇవ్వదలచుకోలేదని అధికారికంగా చెపుతుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీని ప్రాధేయపడితే ఇస్తారా? అంటే అనుమానమే. కనుక మళ్ళీ కొత్త అప్పులు, జీఎస్టీలో రాష్ట్రానికి రావలసిన వాటాను అడిగి తెచ్చుకోవలసి ఉంటుంది.

ఇంతకీ సిఎం జగన్మోహన్ రెడ్డి నిధుల కోసమే ఢిల్లీ వెళ్ళారా లేదా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, నిన్న రామోజీరావును, జూ.ఎన్టీఆర్‌లతో భేటీ అవడంతో కంగారుపడి వెళ్ళారా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.