YS Jagan declares YSR Birthday as farmers dayనేడు స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఇక నుండి దానిని రైతుల దినోత్సవంగా జరపబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పథకాల ప్రకటనలు న్యూస్ పేపర్లలో ప్రచురించింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే జగన్ మోహన్ రెడ్డి సొంత పేపరైన సాక్షికి ఎక్కువగా ప్రకటనలు ఇవ్వడం. ప్రభుత్వ ప్రకటనలు ఆయా పత్రికల రీడర్ షిప్ బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ సర్క్యూలేషన్ కలిగిన పేపర్లు ఎక్కువ ప్రకటనలు వస్తుంటాయి.

ఆ ప్రకారం ఈనాడుకు ఎక్కువ ప్రకటనలు రావాలి. తెలుగులో అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన పేపర్ ఈనాడు. ఆ తరువాతి స్థానంలో సాక్షి ఉంటుంది. ఈనాడు సర్క్యూలేషన్ సాక్షి సర్క్యూలేషన్ కంటే రెండింతల వరకూ ఉంటుంది. అయితే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకి 2 ఫుల్ పేజిల ప్రభుత్వ యాడ్స్ మాత్రం ఇచ్చింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ కు మాత్రమే పరిమితం చేసింది. ఇదే సమయంలో సాక్షికి చేతికి ఎముక లేనట్టు ప్రకటనలు ఇచ్చింది రాష్ట్రప్రభుత్వం.

సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ కు నాలుగు ఫుల్ పేజీ యాడ్లు…. అలాగే తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లకు చేరి రెండు ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇది కూడా ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం, సొంతవారికి దోచిపెట్టడమే అవుతుందని పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సాక్షిలో ప్రకటనల విషయంలో వివక్ష చూపుతున్నారని జగన్ తరచూ విమర్శించే వారు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు అని వారు ప్రశ్నిస్తున్నారు.