ys jagan crucial decission on capital amaravati in january 2020రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హై పవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇప్పటికే వచ్చింది, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) నివేదిక జనవరి 3న రావలసి ఉంది. ఈ నివేదిక కూడా వచ్చాక.. ఈ రెంటినీ కలిపి అధ్యయనం చేసేందుకు హై పవర్ కమిటీని నియమించారు.

హై పవర్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు అవసరమైతే జనవరి 20న శాసనసభను ప్రత్యేకంగా సమావే శపరచాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా.. ఆదివారం సెలవురోజైనా హైపవర్‌ కమిటీని ఏర్పా టు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని గడువు పెట్టారు. అంటే సరిగ్గా జనవరి 19నాటికి నివేదిక వచ్చే అవకాశం ఉంది.

19నే రిపోర్టు వచ్చినా అదే రోజున మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి ఆమోదిస్తారు. ఆ మరుసటి రోజునే అసెంబ్లీని సమావేశపరుస్తారు. ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఆమోదం సులభమే. అయితే కౌన్సిల్ లో మాత్రం టీడీపీదే పై చెయ్యిగా ఉంది. ఇటీవలే పలు బిల్లులను ఆ పార్టీ అక్కడ పాస్ కాకుండా అడ్డుకుంది.

ఈ క్రమంలో రాజధాని విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది. దీనితో ఆ లోగానే ఆకర్ష మంత్రం ప్రయోగించడమో, లేక మండలిని పూర్తిగా ఎత్తివెయ్యడమో చెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. దీనితో 2020 మొదటి నెల రాజకీయంగా రసవత్తరంగా మారే అవకాశం ఉంది.